సాగు చట్టాలపై నిరసనలు కొనసాగిస్తున్న రైతులతో ఇప్పటికే 12 విడతలుగా చర్చలు జరిపినట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. రైతు సంఘాల నేతలతో చర్చలకు కేంద్రం ఎప్పుడైనా సిద్ధమేనని ప్రకటించారు. వ్యవసాయ చట్టాలకు సంబంధించిన వ్యవహారం సుప్రీంకోర్టులో ఉందని, అందువల్ల ఈ చట్టాలను అమలు చేయలేమన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉందన్నారు.
'రైతులతో ఎప్పుడైనా చర్చలకు సిద్ధమే'
సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నరైతులతో చర్చించడానికి ఎప్పుడైనా సిద్ధమేనని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. ఇప్పటికే 12 విడతలుగా చర్చలు జరిపినట్లు తెలిపిన ఆయన.. వ్యవసాయ చట్టాల అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉండడం వల్ల అమలు చేయలేమన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీ సరిహద్దుల్లో దాదాపు మూడు నెలలుగా కర్షకులు నిరసనలు కొనసాగిస్తున్నారు. వారి నిరసనలకు గురువారం బీఎస్పీ జాతీయ అధికారప్రతినిధి సుధీంద్ర భదోరియా మద్దతు తెలిపారు. రైతుల డిమాండ్లపై కేంద్రం ఇంకా ఆలస్యం చేయరాదని సూచించారు. మరోవైపు, వ్యవసాయ చట్టాలపై కేంద్రం, రైతు సంఘాల మధ్య 12 విడతలుగా చర్చలు జరిగినా ఎలాంటి ఫలితం రాలేదు. కేంద్రం దిగిరాకపోవడం, రైతులు పట్టువీడకపోవడంతో ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది.