దేశంలో థర్డ్ వేవ్ రూపంలో కరోనా వైరస్ (Third wave in India) మరోసారి విజృంభిస్తే దానిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ పేర్కొన్నారు. ఇందుకోసం రూ.23వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా థర్డ్‌వేవ్‌లో ఇతరులతో పోలిస్తే చిన్నారులు ఎక్కువ ప్రభావానికి గురవుతారని వస్తున్న వార్తల నేపథ్యంలో పిల్లల సంరక్షణ విభాగాలను బలోపేతం చేస్తున్నామని అన్నారు. జన్ ఆశీర్వాద్ యాత్రలో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటిస్తున్న అనురాగ్ ఠాకుర్, ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ సిలిండర్లు కూడా భారీ స్థాయిలో అందుబాటులో ఉన్నాయని అన్నారు.
"దేశంలో కరోనా థర్డ్ వేవ్ (Third wave in India) అనివార్యమని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దేశంలో సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోన్న సమయంలో ఆ స్థాయిలో ఆక్సిజన్ సిలిండర్లు అవసరమవుతాయని ఊహించలేదు. కానీ, ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ సిలిండర్లు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వం ఉచితంగానే అందజేస్తోంది. ఇందుకు దాదాపు రూ.35వేల కోట్లను కేటాయించింది."
-అనురాగ్ ఠాకుర్, కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి