Centre Issues Notice To Social Media Platforms : ప్రముఖ సోషల్ మీడియా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించింది. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్), యూట్యూబ్, టెలిగ్రామ్‌లకు నోటీసులు పంపించింది. ఈ సామాజిక మాధ్యమాలు వెంటనే స్పందించకపోతే.. ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం వాటికి కల్పిస్తున్న రక్షణను ఉపసంహరించుకుంటామని స్పష్టం చేసింది. అనంతరం, అందులోని కంటెంట్‌కు బాధ్యులుగా పేర్కొని విచారణ జరుపుతామని పేర్కొంది.
"భారత్‌లో తమ ప్లాట్‌ఫామ్‌ల నుంచి చిన్నారుల లైంగిక వేధింపులకు సంబంధించిన మెటీరియల్‌ను తొలగించాలని హెచ్చరిస్తూ కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ నోటీసులు జారీ చేసింది. తమ ప్లాట్‌ఫామ్‌లలో లైంగిక వేధింపుల కంటెంట్‌ను వెంటనే తొలగించడం చాలా ముఖ్యమని చెప్పేందుకు ఈ నోటీసులు ఇచ్చాం. శాశ్వతంగా ఈ కంటెంట్‌ను తొలగించాలని ఆదేశించాం. భవిష్యత్‌లోనూ ఇలాంటి కంటెంట్ వ్యాప్తి చెందకుండా తగిన మెకానిజం, అల్గారిథాన్ని రూపొందించుకోవాలని స్పష్టం చేశాం."
-నోటీసుల్లో కేంద్రం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ యాక్ట్ 2000, సెక్షన్ 66E, 67, 67A, 67B ప్రకారం.. పోర్నోగ్రాఫిక్ కంటెంట్, చైల్డ్ అబ్యూజ్డ్ కంటెంట్ ఉన్న సామాజిక మాధ్యమాలపై ఫైన్, ఇతర చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది కేంద్రం.