మహారాష్ట్రలో కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి సాయం చేస్తామని కేంద్రం హామీ ఇచ్చినట్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పేర్కొన్నారు. ఈ మేరకు తాను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌తో బుధవారం మాట్లాడానని చెప్పారు. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కరోనా పరిస్థితులను ఎదుర్కోవడంలో అండగా ఉంటామని హర్షవర్ధన్ హామీ ఇచ్చారని చెప్పారు.
"మహారాష్ట్రలో కరోనా పరిస్థితి భయానకంగా ఉంది. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకొని సహకరించాలని నేను అందరినీ కోరుతున్నాను. పౌరుల ప్రాణాలను కాపాడేందుకు కొన్ని కఠిన చర్యలు అవసరం. కేంద్రం కూడా సాయం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేను కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌తో మాట్లాడాను."
- శరద్ పవార్,ఎన్సీపీ చీఫ్
కొవిడ్ టీకా సరఫరా.. నిల్వలపై కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య రగడ నెలకొన్న వేళ.. శరద్ పవార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అంతకుముందు రాష్ట్రంలో వ్యాక్సిన్ కొరత ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయితే.. అసలు కొరతే లేదని, తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికేమహారాష్ట్ర సర్కార్ అలా చెబుతోందని కేంద్రం తోసిపుచ్చింది. కరోనాను ఎదుర్కోవడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడింది.