ఊహాగానాలు, సంశయాలు, ఆధారాలు లేని మీడియా నివేదికల ఆధారంగా పెగసస్ హ్యాకింగ్‌పై విచారణ చేయాలంటూ వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పెగసస్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు కేంద్రం రెండు పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. పెగసస్ ఆరోపణలపై ప్రభుత్వ వైఖరిని పార్లమెంట్‌లో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇప్పటికే స్పష్టం చేశారని అఫిడవిట్లో పేర్కొంది.
పెగసస్ అంశంలో అన్ని అంశాలను నిగ్గు తేల్చేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందని.. సుప్రీంకు తెలిపింది. పెగసస్ స్పై వేర్ ను ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, ఇతరులను లక్ష్యంగా చేసుకోవడానికి ఉపయోగించారన్న వాదనను ఖండించింది. ఇవి కేవలం ఊహలు మాత్రమేనని అఫిడవిట్లో స్పష్టం చేసింది.
ట్రైబ్యునళ్ల నియామకంపై అసహనం..
ట్రైబ్యునళ్ల ఏర్పాటు, సభ్యుల నియామకాల్లో జాప్యం విషయంలో కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ట్రైబ్యునళ్ల పదవుల నియామకాల్లో కేంద్రం ఏడాదిగా చెప్పిందే చెబుతోంది తప్ప ఆచరణ లేదని సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్రం పాటించడం లేదని ఆగ్రహించింది. 10 రోజుల్లోగా ట్రైబ్యునళ్లలో నియామకాలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేసేందుకు ఎందుకింత ఆలోచిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. సుప్రీం ఆదేశాలను అమలు చేస్తామని గత విచారణ సమయంలో చెప్పిన కేంద్రం ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను అడిగింది. ఇందుకు ఆయన స్పందిస్తూ.. ట్రైబ్యునళ్ల ఏర్పాటు, ఖాళీల నియామకానికి 2 వారాల గడువు ఇవ్వాలని కోరారు. దీంతో అసహనానికి గురైన ధర్మాసనం.. 'ఇదే చివరి అవకాశం. మరోసారి సమయం ఇవ్వడం కుదరదు. 10 రోజుల్లోగా నియామకాలు చేపట్టండి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి' అని హెచ్చరించింది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 31వ తేదీకి వాయిదా వేసింది.
ఈ సందర్భంగా ట్రైబ్యునల్ రిఫామ్స్ బిల్లు 2021పైనా సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆర్డినెన్సును కోర్టు నిలిపివేసిన తర్వాత పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. అసలు ట్రైబ్యునళ్లను కొనసాగిస్తారా లేదా మూసివేస్తారా అన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని సూచించింది. ట్రైబ్యునల్ రిఫామ్స్ బిల్లు ఆగస్టు 3న లోక్‌సభలో, ఆగస్టు 9న రాజ్యసభలో ఆమోదం పొందింది.
ఇదీ చూడండి:కాంగ్రెస్ పార్టీకి మరో కీలక నేత గుడ్‌బై