రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల సొంత అవసరాల కోసం (కేప్టివ్) ఎలాంటి గనులు కేటాయించడానికి వీల్లేదని కేంద్ర గనుల శాఖ స్పష్టం చేసింది. దీంతో పాటు ఏదైనా ప్రత్యేక వినియోగం కోసం (ఎండ్ యూజ్) పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ గనులను రిజర్వ్ చేయకూడదని పేర్కొంది. ఈ మేరకు మినరల్ (ఆక్షన్) సెకండ్ అమెండ్మెంట్ రూల్స్-2021ని విడుదల చేసింది.
ఈ నిబంధనలు అమల్లోకి రావడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వాలు కేప్టివ్ అవసరాల కోసం గనులను వేలం వేసి ఉంటే, అలాంటి వాటి నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన మొత్తం ఖనిజంలో సగం మేరకు బహిరంగ మార్కెట్లో అమ్ముకొనే అవకాశం కల్పించింది. మైనింగ్ లీజుల కోసం వేలం వేయడానికి సిద్ధంగా ఉన్న గనులు, ప్రాంతాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా కేంద్రానికి తెలపాలని పేర్కొంది.