Centre Decided to Re-examine Sedition Law: దేశద్రోహ చట్టం రాజ్యాంగ బద్ధతను పరిశీలించడానికి సమయం వెచ్చించవద్దని సోమవారం సుప్రీంకోర్టును కోరింది కేంద్ర ప్రభుత్వం. ఈ చట్టాన్ని కంపీటెంట్ ఫోరమ్ వద్ద పునః పరిశీలించాలని నిర్ణయించినట్లు తెలిపింది. అప్పటివరకు దేశద్రోహ చట్టానికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ ఆపాలని కోరింది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా పాతకాలపు చట్టాలను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగానే దేశ ద్రోహ చట్టాన్ని కూడా రద్దు చేయాలని భావించారు. కానీ ఆ చట్టాన్ని మళ్లీ సమీక్షిస్తామని.. అందులోని లోపాలను సరిదిద్దనున్నట్లు తాజాగా ప్రవేశపెట్టిన అఫిడవిట్‌లో వెల్లడించింది. కాగా, శనివారం సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ చట్టాన్ని సమర్థించింది కేంద్రం. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూ 1962లో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును గుర్తు చేసింది.