జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్న భద్రతా బలగాలు.. వారికి పాక్ నుంచి ముష్కరులకు అందుతున్న సమాచారంపై దృష్టి సారించారు. నిఘా వర్గాల పక్కా సమాచారంతో ఉగ్రవాదులకు సమాచారం చేరవేస్తున్న 14 మొబైల్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ 14 యాప్‌లను పాకిస్థాన్ నుంచి ఆదేశాలు స్వీకరించేందుకు జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని వ్యాప్తికి ఈ 14 యాప్‌లను ముష్కరులు ఎక్కువగా వినియోగిస్తున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయని కేంద్ర ప్రభుత్వం వివరించింది.
ఈ 14 యాప్‌లను ఉగ్రవాదులు, ముష్కరుల మద్దతుదారులు పరస్పరం అనుసంధానం చేసుకోవడానికి ఉపయోగిస్తున్నారని కేంద్రం తెలిపింది. క్షేత్రస్థాయిలో ఉన్న కొందరు ముష్కరుల మద్దతుదారుల ఫోన్‌ను ట్రాక్ చేయడానికి యత్నించినప్పుడు.. ఈ యాప్‌లు వినియోగిస్తున్నట్లు తేలింది. కేంద్రం నిషేధించిన 14 యాప్‌లకు భారత్‌లో కనీసం ప్రతినిధి లేడని... ఈ యాప్ కార్యకలాపాలు ట్రాక్ చేయడం కష్టం కాబట్టి నిషేధిస్తున్నట్లు ఓ ఉన్నతస్థాయి అధికారి తెలిపారు. క్రిప్‌వైజర్, ఎనిగ్మా, సేఫ్‌విస్, విక్రమ్, మీడియా ఫైర్, బ్రియార్, బీ చాట్, నంద్‌బాక్స్. కోనియన్.. IMO, ఎలిమెంట్, సెకండ్ లైన్, జాంగి, త్రీమా యాప్‌లను నిషేధించినట్లు వివరించారు.