దేశంలోని పలు రాష్ట్రాలు లాక్డౌన్ నిబంధనలు సడలిస్తున్న వేళ.. కేంద్రం ఆయా ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. మార్కెట్లు, ఇతర ప్రదేశాలలో రద్దీ ఎక్కువగా ఉంటోందని పేర్కొంది. కరోనా కట్టడికి ఐదు సూత్రాల వ్యూహాన్ని పాటించడం చాలా ముఖ్యమని స్పష్టం చేసింది. టెస్ట్-ట్రాక్-ట్రీట్- వ్యాక్సినేషన్- నిరంతర నిఘా వంటి నియమాలను తప్పక అనుసరించాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్‌లకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు.
క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ఆంక్షలు విధించడం లేదా సడలింపులు ఇవ్వాడం వంటివి చేపట్టాలని భల్లా సూచించారు. ఆంక్షల మినహాయింపుల అనంతరం కూడా కరోనా నియంత్రణకు 5 సూత్రాల ప్రణాళికను అమలు చేయాలని స్పష్టం చేశారు.
కేంద్ర హోంశాఖ సూచనలు
- కేసుల సంఖ్య పెరిగినా, పాజిటివిటీ రేటు అధికంగా నమోదైనా.. ఆయా ప్రాంతాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలి.
- వ్యాక్సినేషన్ ద్వారా కరోనా సంక్రమణ అనుసంధానాన్ని విచ్ఛిన్నం చేయడం చాలా కీలకం.
- రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి.
- పరిస్థితిని నిశితంగా పరిశీలించి కార్యకలాపాలు జాగ్రత్తగా పునఃప్రారంభించాలి.
- ఇందుకోసం జిల్లా, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలి.
మాస్కులు, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం వంటి ప్రాథమిక నిబంధనలను విస్మరించకూడదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. మూసి ఉన్న ప్రదేశాల్లో తగిన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని వివరించింది. నిర్లక్ష్యానికి అసలు తావు ఇవ్వొద్దని పేర్కొంది.