గంగానదిలో కరోనా అనుమానిత మృతదేహాలు భారీగా వెలుగుచూసిన వేళ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు సంబంధిత జిల్లా గంగా కమిటీలకు లేఖలు రాసిన కేంద్రం.. గంగా నదితో పాటు దాని ఉప నదుల్లో ఎక్కడా మృతదేహాలు వేయకుండా నిఘా పెంచాలని స్పష్టం చేసింది.
ఇలాంటి ఘటనలు గంగా నదిని కలుషితం చేయడం సహా ఆ నదీ పరివాహక ప్రాంతాలను విషతుల్యం చేస్తాయని కలెక్టర్లకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది. ఈ చర్యలు నిరోధించడానికి తీసుకుంటున్న కార్యాచరణ ఏమిటన్న దానిపై 14 రోజుల్లో నివేదిక సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించింది.