Y Break At Workplace : ఉద్యోగులు.. ఆఫీసు సమయంలోనే యోగా చేసేందుకు Y బ్రేక్‌ను తీసుకోవాలని కేంద్రం ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని శాఖల్లోని ఉద్యోగులు ఈ యోగా నిబంధనలను పాటించాలని సిబ్బంది శిక్షణ, వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పని ప్రదేశంలో ఒత్తిడిని తగ్గించుకుని, రీఫోకస్, రీఫ్రెష్ అయ్యేందుకు వీలుగా ఆఫీసు సమయంలో కుర్చీలోనే యోగా చేయాలని సూచించింది.
ఉద్యోగులు బిజీ షెడ్యూల్‌తో యోగా చేయలేకపోతున్నారని.. అందుకే వారికి ఆఫీసు కుర్చీలోనే కూర్చుని యోగా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పింది సిబ్బంది శిక్షణ, వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఆఫీసులోనే ఎలాంటి ఆసనాలు వేయొచ్చే తెలిపే యూట్యూబ్ వీడియోల లింక్‌లను తన ప్రకటనలో జతచేసింది. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా సంస్థ, ఆయుష్ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాయి. ఇందులో ఆసనాలు, ప్రాణాయామ, ధ్యానానికి సంబంధించిన విధానాలు ఉంటాయని వివరించింది. వీటిని నిపుణుల సూచనలతో రూపొందించినట్లు చెప్పింది.
Yoga Benefits For Health : పనిచేసే ప్రదేశంలో యోగా, ఆసనాలువేసుకోవచ్చని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఊర్ద్వ హస్తాసనం, తడాసనం వంటివి పని ప్రదేశంలోనే చేసుకోవచ్చని వెల్లడించింది. మొదట నిటారుగా నిలబడి.. నడుమును కుడివైపు వంచి చేతులు పైకెత్తి శ్వాస తీసుకోవాలి. అలాగే ఎడమవైపు తిరిగి ముక్కుతో గాలి పీల్చుకోవాలి. ఆ తర్వాత కొన్ని సెకన్లు రిలాక్స్డ్గా ఉండాలి. ఆ తర్వాత వీపుపై చేతులు పెట్టాలి. అనంతరం రెండు కాళ్లు దూరంగా పెట్టి వెనక్కి వంగి గాలి పీల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉద్యోగులు ఒత్తిడి నుంచి బయటపడవచ్చు. ఉద్యోగుల కోసం ఈ యూట్యూబ్ వీడియోను షేర్ చేసింది కేంద్ర ఆయూష్ మంత్రిత్వ శాఖ.
ముక్కు ఎడమ రంధ్రాన్ని చేతితో మూసి.. కుడి రంధ్రం నుంచి గాలి పీల్చాలి. తర్వాత మెల్లగా గాలిని వదలాలి. ఆ తర్వాత పొట్టపై చేతులను పెట్టి శ్వాస తీసుకోవాలి. ఈ ఆసనం ఎలా చేయాలో ఈ యూట్యూబ్ వీడియోలో చూసేయండి.
పాదయాత్ర చేస్తూ యోగాకు ప్రచారం..
యోగా గొప్పతనాన్ని తెలియజేయాలని ఈ కృష్ణ నాయర్ అనే యోగా టీచర్.. ఈ ఏడాది ఏప్రిల్‌లో మైసూరు నుంచి పాదయాత్ర ఆరంభించాడు. గత ఆరు నెలలుగా కర్ణాటకతో పాటు కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో పర్యటించాడు. ఒడిశాలో పర్యటన ముగిసిన అనంతరం బంగాల్లోని హుగ్లీలో కొనసాగిస్తున్నాడు. విద్యార్థినులకు కూడా యోగా, పర్యావరణ సంరక్షణ మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. మనుషులు అనేక రోగాల బారిన పడుతున్నారని.. వాటిని ఎదుర్కోడానికి క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం అవసరం అని తెలిపాడు. దీంతో పాటు చెట్లు నాటడం కూడా ముఖ్యం అని చెబుతున్నాడు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.