అందరికీ కరోనా టీకాను తొందరగా అందించడమే లక్ష్యంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సోమవారం ఆదేశించింది.
అసోం, దిల్లీ, పంజాబ్, జమ్ముకశ్మీర్, దాద్రా&నగర్ హవేలీ, లద్దాఖ్, తమిళనాడు, చండీగఢ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపుర్, పుదుచ్చేరిలలో.. ఇప్పటి వరకు 40 శాతం కంటే తక్కువ మంది ఆరోగ్య సిబ్బంది టీకా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో వర్చువల్‌గా సమావేశమైన కేంద్ర వైద్య ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్.. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు.. 'ఈటీవీ భారత్'కు తెలిపాయి.
టీకా పంపిణీ ఎలా సాగుతోందంటే..
- బిహార్, మధ్యప్రదేశ్, త్రిపుర, ఉత్తరాఖండ్, మిజోరాం, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ, ఒడిశా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, చత్తీస్‌గఢ్‌లలో 60 శాతం కంటే ఎక్కువ మంది టీకా తీసుకున్నారు.
- తొలి దశ వ్యాక్సినేషన్లో భాగంగా.. కోటి మంది ఆరోగ్య సిబ్బందికి, రెండు కోట్ల మంది కరోనా యోధులకు టీకా వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 5 నుంచి కరోనా యోధులకు టీకా వేయడం ప్రారంభించింది.
- 50 ఏళ్లకు పైబడిన 27 కోట్ల మందికి మార్చి నుంచి టీకా వేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. వ్యాక్సినేషన్ ప్రారంభించిన, జనవరి 16 నుంచి ఇప్పటివరకు 58 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి టీకా అందింది.
- సోమవారం ఉదయం నాటికి 1,16.478 వ్యాక్సినేషన్ సెషన్లను నిర్వహించారు.
- టీకా వల్ల ప్రతికూల పరిస్థితులు తలెత్తి ఇంతవరకు ఎలాంటి మరణాలు జరగలేదని కేంద్రం చెప్పింది.
కొత్త కేసుల వివరాలు ఇలా..
- గత 24 గంటల్లో 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా సంబంధిత మరణాలు ఏవీ నమోదు కాలేదు.
- 33 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 5,000 కంటే తక్కువ కేసులే నమోదయ్యాయి.
- 10 రోజలుగా భారత్‌లో కరోనా మరణాలు 150 కంటే తక్కువగా నమోదవుతున్నాయి.
- గత 24 గంటల్లో 84 మంది వైరస్ ధాటికి బలయ్యారు.
- మొత్తం పాజిటివ్ కేసుల్లో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 1.37 శాతం మాత్రమే.
ఇదీ చదవండి:చకచకా అందరికీ అందాలి కరోనా టీకా!