దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో... వైద్య విద్యార్హతలు కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మెడికల్ ప్రాక్టీసు, టెలీకన్సల్టేషన్ సేవలు అందించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. అయితే.. ఖాళీ సమయాల్లో, స్వచ్ఛందంగా మాత్రమే ఇందులో పాల్గొనాలని తెలిపింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(డీఓపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో టెలీకన్సల్టేషన్ సేవలను అందించడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సలహాలను స్వీకరిస్తున్నట్లు తెలిపింది.
"ప్రస్తుత కరోనా విజృంభణ సమయంలో వైరస్ వ్యాప్తి కట్టడి కోసం అంతర్గత సామర్థ్యాలను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ప్రజలకు ఉపశమనం ఇవ్వాలని యోచిస్తోంది. ఏ వైద్య విధానంలోనైనా.. అర్హత ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. మెడికల్ ప్రాక్టీస్ లేదా టెలీ కన్సల్టేషన్ సేవలు అందించేందుకు సంబంధిత శాఖాధిపతుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు."
-డీఓపీటీ