Monkeypox India news: మంకీపాక్స్ కేసులు పలు దేశాల్లో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని నిరంతరం కన్నేసి ఉంచాలని ఐసీఎంఆర్, సీడీసీలకు ఆదేశాలు జారీ చేసింది. మంకీపాక్స్ కేసులు బయటపడ్డ దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు.. తమకు లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే ఐసోలేషన్‌కు వెళ్లాలని సూచించింది. ఈ ప్రయాణికుల నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా, బ్రిటన్, పోర్చుగల్, స్పెయిన్ సహా పలు ఐరోపా దేశాల్లో మంకీపాక్స్ వైరస్ వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర వైద్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తాజా ఆదేశాలు జారీ చేశారని అధికారులు వెల్లడించారు.
monkeypox disease outbreak: బ్రిటన్, స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, యూఎస్, స్వీడన్, కెనడా దేశాల్లో ఇటీవల కేసులు బయటపడ్డాయి. ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, ఆస్ట్రేలియా దేశాల్లో శుక్రవారమే మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కాగా, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ మంకీపాక్స్ కేసులు వెలుగులోకి రావడంపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆఫ్రికా దేశానికి వెళ్లని వారిలోనూ కేసులు నమోదు కావడంపై అయోమయం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ ఆఫ్రికాలో కూడా వైరస్ ఇలా వ్యాపించలేదని ప్రముఖ వైరాలజిస్ట్ ఒయ్వాల్ తొమోరి తెలిపారు. వైరస్‌లో ఏదో మార్పులు సంభవించి ఉండొచ్చని పేర్కొన్నారు.
"నైజీరియాలో సంవత్సరానికి 3వేల వరకు కేసులు వస్తుంటాయి. చాలావరకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఇవి బయటపడతాయి. అయితే, ఇది (ఐరోపాలో వ్యాప్తి) నైజీరియా మాదిరిగా లేదు. ఎబోలా వంటి వైరస్లు.. ప్రారంభంలో శృంగారం ద్వారా సోకేవి కాదు. కానీ, వాటి వ్యాప్తి తీవ్రమైన తర్వాత.. సెక్స్ కూడా వైరస్ వ్యాప్తికి కారణమైంది. మంకీపాక్స్ విషయంలో కూడా ఇది నిజం కావొచ్చు. దీనిపై రికార్డులను పరిశీలించాల్సి ఉంది. భార్యాభర్తలకు, పరస్పర లైంగిక సంబంధం ఉన్న వ్యక్తులకు వైరస్ సోకిందేమో అన్న విషయాన్ని తెలుసుకోవాలి."
-ఒయ్వాల్ తొమోరి, వైరాలజిస్ట్