కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న సెంట్రల్ విస్టా పునఃరాభివృద్ధి ప్రాజెక్టుకు తాజా ప్రతిపాదనలు చేసింది కేంద్రం. ఇందులో ప్రధానమంత్రి కొత్త నివాస సముదాయాల్లో 10 భవనాలు ఉంటాయని తెలుస్తోంది. ఈ భవనాలు గరిష్ఠంగా 12 మీటర్ల ఎత్తుతో నాలుగు అంతస్తులు ఉండనున్నాయి. అయితే.. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నుంచి పీఎంఓ నూతన కార్యాలయాన్ని మినహాయించే ప్రశ్నే లేదని అధికారవర్గాలు తెలిపాయి. పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ ముందు కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) ఉంచిన కొత్త ప్రతిపాదనలో పీఎంఓ కార్యాలయం మినహాయింపుపై పేర్కొనలేదని తెలిపారు.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టును చేపడుతోన్న సీపీడబ్ల్యూడీ.. ప్రాజెక్టు వ్యయాన్ని సవరించింది. గతంలో అంచనా వేసిన రూ.11,794 కోట్ల నుంచి రూ.13,450 కోట్లకు పెంచింది.
" ప్రధానమంత్రి కొత్త నివాస భవనాలు 15 ఎకరాల స్థలంలో నిర్మించనున్నాం. అందులో 10 భవనాలు, నాలుగు అంతస్తుల్లో ఉంటాయి. ఒక్కో భవనం 30,351 చదరపు మీటర్ల మేర విస్తరించి ఉంటుంది. అలాగే.. ప్రత్యేక భద్రత దళం భవనం 2.50 ఎకరాల స్థలంలో ఉంటుంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌లోనే ఉపరాష్ట్రపతి ఎన్క్లేవ్ ఉండనుంది. గరిష్ఠంగా 15 మీటర్ల ఎత్తుతో ఐదు అంతస్తులతో 32 భవనాలు ఉంటాయి."