Union Cabinet Reshuffle 2023 : కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, పార్టీ సంస్థాగత మార్పులు జరుగుతాయన్న ఊహాగానాల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేతలు, పలువురు కేంద్ర మంత్రులు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బుధవారం భేటీ అయ్యారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అర్జున్‌రామ్ మేఘ్వాల్, భూపేంద్ర యాదవ్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, జ్యోతిరాదిత్య సింధియా, కిరణ్ రిజిజు, సత్యపాల్ సింగ్ బఘేల్, కొత్తగా నియమితులైన పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జాఖడ్.. జేపీ నడ్డాతో దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల నేపథ్యంలో వీరందరూ తమ మంత్రి పదవుల గురించి నడ్డాతో చర్చించినట్లు తెలుస్తోంది.
'మా పదవి ఉంటుందా?'.. జేపీ నడ్డాతో భేటీకి మంత్రుల క్యూ! - union cabinet reshuffle news
Union Cabinet Reshuffle 2023 : కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వార్తల నేపథ్యంలో కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనాయకులు.. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి క్యూ కట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో విడివిడిగా భేటీ అయ్యారు. తమ మంత్రి పదవి గురించి కేంద్ర మంత్రులు.. నడ్డాతో సమావేశమైనట్లు తెలుస్తోంది.
central Ministers Meets JP Nadda : మరోవైపు.. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్‌ను కలిశారని పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనాయకులు.. జేపీ నడ్డా, బీఎల్ సంతోశ్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వీరు జేపీ నడ్డాతో భేటీలో ఏ విషయంపై చర్చించారనే విషయం ఇంకా తెలియలేదు. పార్టీ సంస్థాగత కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని.. ఈ నేపథ్యంలో అగ్రనాయకులు, కేంద్ర మంత్రులు.. జేపీ నడ్డాను కలుస్తున్నారని బీజేపీ నాయకుడు ఒకరు తెలిపారు. ఈ భేటీలకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాలతో ముడిపెట్టవద్దని అన్నారు.
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి సైతం.. దిల్లీలో పార్టీ నేత సునీల్ బన్సల్‌తో గంటపాటు సమావేశమయ్యారు. అలాగే పార్టీ ఆఫీస్ బేరర్లతో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేను క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తను. పార్టీ నిర్ణయం మేరకే ముందుకు సాగుతా. జులై 8న వరంగల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సభ అయ్యాక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతాను. కేంద్రమంత్రిగా ఉండాలా? లేదా అనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు నడుచుకుంటాను' అని కిషన్ రెడ్డి అన్నారు.