తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకప్పుడు హత్యలు, అకృత్యాలు.. ఇప్పుడు వేదమంత్రాలు జపిస్తూ! - మధ్యప్రదేశ్​ భోపాల్​

Central Jail Bhopal Prisoners: చేసిన తప్పును తెలుసుకుని మరోసారి దాన్ని చేయకుండా నిలువరించడమే జైలు శిక్షల ఉద్దేశం. కాలక్రమేణా కారాగారాల్లో మానసిక పరివర్తన కార్యక్రమాలు, స్వయం ఉపాధి శిక్షణ వంటివి వచ్చి చేరాయి. ఇదే క్రమంలో దేశంలోని ఓ జైలులో ఖైదీలను పురోహితులుగా తీర్చిదిద్దే వినూత్న కార్యక్రమం చేపట్టారు అక్కడి అధికారులు. మరి ఆ జైలు కథ ఏమిటో చూద్దామా?

Central Jail Bhopal prisoners learning panditai training started
Central Jail Bhopal prisoners learning panditai training started

By

Published : Mar 20, 2022, 3:37 PM IST

పురోహితులుగా మారుతున్న ఖైదీలు

Central Jail Bhopal Prisoners: తప్పు చేసి జైలుకు వెళ్లిన నేరగాళ్లను మొదట వేధించే సమస్య మానసిక కుంగుబాటు. నేరం చేయడం తప్పే అయినా అప్పటి వరకు స్వేచ్ఛా జీవిగా మసలిన వ్యక్తి ఒక్కసారిగా నాలుగు గోడల మధ్య బందీగా మారితే మానసికంగా అది వారికి ఇబ్బందికర పరిస్ధితే. తమలో తాము కుంగిపోయి ఖైదీలు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు అనేకం. అయితే వారికి శిక్షలను కొనసాగిస్తూనే ఈ మానసిక కుంగుబాటును తొలగించేందుకు జైళ్లలో సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. జైలు నుంచి విడుదలైన తర్వాత తమ కాళ్ల మీద తాము నిలబడేలా ఉపాధి కార్యక్రమాల్లోనూ శిక్షణ ఇస్తుంటారు. వీటికి భిన్నంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ కేంద్ర కారాగారంలో ఖైదీలను పురోహితులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టారు అక్కడి అధికారులు.

ఆధ్యాత్మిక వేత్తలను జైలుకు పిలిపించి వారి చేత ఖైదీలకు వేదాలు, మంత్రాలను బోధింప జేస్తున్నారు భోపాల్‌ జైలు అధికారులు. యజ్ఞ కర్మలను నిర్వహించడం సహా, పురోహితులుగా స్ధిరపడేందుకు అవసరమైన శిక్షణను కూడా ఇస్తున్నారు. ఒకప్పుడు హత్యలు, మహిళలపై అకృత్యాలు సహా వివిధ నేరాలకు పాల్పడిన ఖైదీలు ఇప్పుడు వేదాలు, మంత్రాలు పఠిస్తున్నారు.

నేరస్ధులను చేసిన తప్పునకు జైల్లో బంధించి శిక్షించడం ఒక ఉద్దేశమైతే, వారు తమ నేరాన్ని తెలుసుకుని సన్మార్గంలో నడిచేలా చేయడం మరో ఉద్దేశం. దీనికి ఆధ్యాత్మిక బోధన సరైన మార్గం అని గుర్తించారు భోపాల్‌ జైలు అధికారులు. గతంలో జరిగిన ఇలాంటి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వడంతో మళ్లీ ఆ మార్గాన్ని ఎంచుకున్నామని వారు అంటున్నారు.

''జైళ్లలో ఖైదీలు మానసిక కుంగుబాటు లేదా దూకుడుతో ఉంటారు. జైలుకు రాగానే ఎవరైనా సామాన్యంగా ఉండలేరు. చాలా మంది పరిస్ధితుల కారణంగా జైలుకు వస్తారు. మధ్యప్రదేశ్‌ జైళ్లలో 2007, 2008లో జనపురోహిత్‌ అనే కార్యక్రమం చేపట్టాం. ఇందులో ఖైదీలకు సనాతన ధర్మానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను నేర్పించాం. దాని వల్ల మంచి ఫలితాలు వచ్చాయి. సాధారణ ఖైదీల్లో ఈ కార్యక్రమం ద్వారా ఒక సానుకూల శక్తిని పెంచేలా చేస్తున్నాం. జైలు నుంచి విడుదలైన తర్వాత ఖైదీలు సమాజానికి ఒక సందేశం కూడా ఇవ్వగలరు.''

- దినేశ్‌ నర్‌గావే, భోపాల్‌ జైలు సూపరింటెండెంట్​

ఖైదీల ఆసక్తి, వారి సామర్ధ్యం ఆధారంగానే వారిని పురోహితులుగా శిక్షణ కోసం ఎంపిక చేస్తున్నామని వారిని తీర్చిదిద్దుతున్న ఆధ్యాత్మిక గురువులు అంటున్నారు.

''ఖైదీలు జైలు నుంచి విడుదలై సమాజంలోకి అడుగుపెట్టిన తర్వాత మంచి వ్యక్తులుగా మసలుకునేలా చేసే ఉద్దేశంతో ఇక్కడ యుగ్‌పురుష్‌ శిక్షణ కార్యక్రమం చేపట్టాం. పురోహితుడు అంటే ఇతరుల మేలు కోరి ముందుకు సాగడం. దీని ద్వారా వారు ఇతరులు, సమాజం, దేశం గురించి ఆలోచిస్తారు. అది ఈ కార్యక్రమ ఉద్దేశం. యజ్ఞ నిర్వహణ కార్యక్రమం గురించి మేం బోధిస్తున్న విధానం చాలా సులభంగా ఉంటుంది. ఖైదీల అర్హత, నేర్చుకునే సామర్ధ్యం సహా వారికి ఆసక్తి ఉందా లేదా అని పరిశీలిస్తాం.''

- సదానంద్‌ అంబేకర్‌, ఆధ్యాత్మిక గురువు

భోపాల్‌ జైలులో శిక్షణ పొందుతున్న ఖైదీలు సైతం ఇక్కడి ఆధ్యాత్మిక శిక్షణపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ శిక్షణ తర్వాత తమ మానసిక స్ధితి మెరుగైందని అంటున్నారు.

''గురువులు బోధించిన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం, పురోహితుడుగా మారడం, సమాజంలో ప్రేమ, న్యాయం, సోదరభావం అనే భావనను ఏర్పచేలా ఇక్కడ నేర్పిస్తున్నారు. మహిళలను గౌరవించడం సహా అన్ని రకాల ఆధ్యాత్మిక శిక్షణ, మంత్రాలు, యజ్ఞ కర్మలు వంటివి ఇక్కడ గురువుల ద్వారా నేర్పిస్తున్నారు. దాని వల్ల చాలా బాగుంటుంది. గతంలో మనసు అశాంతితో ఉండేది. మనసులో వ్యతిరేక భావన వస్తూ ఉండేది. అయితే ఈ శిక్షణ కార్యక్రమంలో భాగమైన తర్వాత మనసుకు శాంతి, సానుకూల శక్తి వస్తోంది.''

- సందీప్‌ మున్నాపవార్‌, ఖైదీ

ఖైదీలు సమాజంలో సన్మార్గంలో బతకడమే తమ ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమాల అసలు ఉద్దేశం అని భోపాల్‌ జైలు అధికారులు అంటున్నారు.

ఇవీ చూడండి:Jail theme restaurant: ఈ జైలు భోజనం అదుర్స్..

పోలీస్​స్టేషన్​కు నిప్పంటించిన 'భార్య' బాధితుడు

ప్రేమించి పెళ్లికి నిరాకరణ- జైల్లోనే తాళి కట్టించిన అధికారులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details