సైబర్‌నేరాల నియంత్రణ, మహిళా భద్రత, తీరప్రాంతాల రక్షణ సహా అంతర్గత భద్రతపై చర్చించేందుకు తలపెట్టిన అన్నిరాష్ట్రాల హోం మంత్రుల రెండు రోజుల సమావేశాలు హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో ప్రారంభమయ్యాయి. చింతన్ శిబిర్‌గా నామకరణం చేసిన ఈ సమావేశాలకు.. శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హాజరై ప్రసంగించారు. సైబర్ నేరాలు, ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలను రచించడానికి ఈ చింతన్ శిబిర్ మంచి వేదికగా మారనుందని అమిత్ షా తెలిపారు.
"మన రాజ్యాంగంలో శాంతిభద్రతలు అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశం. దేశంలోని సైబర్ నేరాలు, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు కలిసి సమావేశమై వ్యూహాల్ని రూపొందించి అమలు చేసినప్పుడే విజయం సాధించగలం. దేశం లేదా రాష్ట్రాల సరిహద్దుల్లో జరుగుతున్న సైబర్ నేరాలను సమర్ధంగా ఎదుర్కోవడం అన్ని రాష్ట్రాల సమష్టి బాధ్యత. అంతర్గత భద్రతకు సంబంధించిన అన్ని రంగాల్లో మోదీ ప్రభుత్వం విజయం సాధించింది. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు అన్ని రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయాలు 2024 కల్లా అందుబాటులో ఉంటాయి. మన దేశ అంతర్గత భద్రత పటిష్ఠంగా ఉంది. దేశ సమగ్రత చెక్కచెదరకుండా ఉండేందుకు 35 వేల మంది పోలీసులు, సీఏపీఎఫ్ సిబ్బంది తమ ప్రాణాలను సైతం అర్పించారు."
-- అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి