తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీఏఏపై దాఖలైన పిటిషన్లు కొట్టేయండి'.. సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి - సీఏఏ పిటిషన్లు

CAA Supreme Court : సీఏఏ చెల్లుబాటును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. సీఏఏ.. అక్రమ వలసలను ప్రోత్సహించదని కేంద్రం తెలిపింది. మరోవైపు, సీఏఏను సవాలుచేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలు సహా మొత్తం 232 పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.

CAA
సీఏఏ

By

Published : Oct 31, 2022, 7:41 AM IST

CAA Supreme Court : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) చెల్లుబాటును సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ చట్టం అక్రమ వలసలను ప్రోత్సహించదని స్పష్టంచేసింది. సీఏఏ.. డిసెంబరు 31, 2014న లేదా అంతకుముందు దేశంలోకి వలస వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, క్రిస్టియన్‌, జైన్‌, పార్సీ మతాలవారికి పౌరసత్వాన్ని మంజూరుచేసే 'ప్రత్యేక చట్టమని' (ఫోకస్డ్‌ లా) పేర్కొంది. సీఏఏను సవాలుచేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలు సహా మొత్తం 232 పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందుకు ఈ వ్యాజ్యాలు విచారణకు రానున్నాయి.

మరోవైపు, కేంద్ర హోం మంత్రిత్వశాఖ సీఏఏకు సంబంధించి 150 పేజీల సవివరమైన ప్రమాణపత్రాన్ని దాఖలుచేసింది. "భారత రాజ్యాంగంలోని 245 (1) అధికరణం కింద దేశం మొత్తానికి లేదా దేశంలోని ఏదైనా కొంత ప్రాంతానికి సంబంధించి చట్టం చేసేందుకు పార్లమెంటుకు అధికారం ఉంది" అని కేంద్ర హోం మంత్రిత్వశాఖలోని సంయుక్త కార్యదర్శి సుమంత్‌ సింగ్‌ ప్రమాణపత్రంలో పేర్కొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేయాలని కోరారు.

హిందూ, సిక్కు, బౌద్ధ, క్రిస్టియన్‌, జైన్‌, పార్సీ మతాల వారికి పౌరసత్వం కల్పిస్తూ, ముస్లింలను విస్మరించడం.. మతపరమైన వివక్షేనంటూ ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ (ఐయూఎంఎల్‌) సహా పలు సంస్థలు, విపక్ష పార్టీలు, సామాజికవేత్తలు, రాజకీయ ప్రముఖులు సుప్రీం కోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు.

ఇవీ చదవండి:కేబుల్ బ్రిడ్జి ప్రమాదం.. 100 దాటిన మృతులు.. రంగంలోకి త్రివిధ దళాలు

కాటేసిన పాముపై రివేంజ్​.. సర్పాన్ని కరిచిన బాలుడు.. పిల్లాడు సేఫ్.. పాము మృతి

ABOUT THE AUTHOR

...view details