దేశంలో పాత వాహనాల రిజిస్ట్రేషన్(Old Vehicle Registration) పునరుద్ధరణ ఛార్జీలను కేంద్రం భారీగా పెంచింది. 15ఏళ్లకు పైబడిన కార్ల రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించుకోవాలంటే.. ఇకపై రూ.5 వేలు చెల్లించాలి. ప్రస్తుతం చెల్లిస్తున్న మొత్తం (రూ.600) కంటే ఇది దాదాపు 8 రెట్లు అధికం. జాతీయ వాహన తుక్కు విధానం అమలుకు వీలుగా.. 'కేంద్ర మోటారు వాహనాల (23వ సవరణ) నిబంధనలు-2021' పేరుతో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు(Old Vehicle Registration) తాజాగా ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
పెంచిన ఛార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. వాహన తుక్కు విధానాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా కొన్ని ప్రోత్సాహకాలనూ కేంద్రం ప్రకటించింది. 'రిజిస్టర్డ్ వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీ' నుంచి పాత వాహన తుక్కు ధ్రువీకరణ పత్రాన్ని పొందినవారు దాన్ని డిపాజిట్ చేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే.. రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
- ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రం గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఫిట్‌నెస్ పరీక్ష ఆలస్యమైతే.. రోజుకు రూ.50 చొప్పున అదనపు రుసుం వసూలు చేస్తారు.
- రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవడంలో జాప్యం చేస్తే.. ఒక్కో నెలకు వ్యక్తిగత వాహనాలకు రూ.300, వాణిజ్య వాహనాలకు రూ.500 చొప్పున అపరాధ రుసుం విధిస్తారు.