బ్లాక్ ఫంగస్ చికిత్స(Black fungus treatment)లో వాడే ఆంఫోటెరిసిన్ బీ ఔషధ ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు మరో 5 కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం లైసెన్సులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రపంచంలో ఈ ఔషధం ఎక్కడ అందుబాటులో ఉన్నా భారత్‌కు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అధికారులను ఆదేశించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత కార్యాలయాలు ఆ పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
భారత్‌కు 10లక్షల వయల్స్..
మైలాన్ సంస్థ ద్వారా అమెరికాలోని గిలియడ్ సైన్సెస్.. భారత్‌కు ఆంఫోటెరిసిన్ బీ (ఆంబీసోమ్) సరఫరాను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 1,21,000 ఆంబీసోమ్ వయల్స్ భారత్ చేరగా, మరో 85 వేల వయల్స్ మార్గం మధ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. మైలాన్ ద్వారా 10లక్షల ఆంఫోటెరిసిన్ వయల్స్‌ను భారత్‌కు సరఫరా చేయనుంది గిలియడ్ సైన్సెస్.