CENTRAL GOVT LETTER TO SC ON POLAVARAM : పోలవరం ముంపుపై దాఖలైన పిటిషన్ల విచారణను వాయిదా వేయాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. విచారణ వాయిదా కోరుతూ లేఖ సమర్పించింది. పోలవరం ప్రాజెక్టు వల్ల వరద ముంపు తలెత్తుతున్నందున దానికి పరిష్కార మార్గాలు చూపాలని ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లు సోమవారం మరోసారి విచారణకు రానున్న క్రమంలో సుప్రీంకోర్టుకు కేంద్రం లేఖ రాసింది. సీఎంలు, జలశక్తి మంత్రి సమావేశం సంప్రదింపుల స్థాయిలోనే ఉందన్నకేంద్ర జల్‌శక్తి శాఖ.. 3 నెలల సమయం ఇవ్వాలని కోరింది.
గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. కసరత్తు జరుగుతోందని, తుది నివేదిక అందించడానికి మరికొంత సమయం అవసరమని పేర్కొంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశం ఇంకా సంప్రదింపుల స్థాయిలోనే ఉందని సుప్రీంకోర్టుకు తెలిపింది. పొరుగు రాష్ట్రాల్లో ముంపుపై కేంద్రం జోక్యం చేసుకోవాలని, భాగస్వాములతో సమావేశం నిర్వహించాలని, అవసరమైతే ప్రభావిత రాష్ట్రాల సీఎంలు కూర్చొని మిగిలిపోయిన సమస్యలు పరిష్కరించుకోవాలని 2022 సెప్టెంబర్ 6న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తుది నివేదిక అందించడానికి మూడు నెలల సమయం కావాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానానికి కేంద్రం లేఖ సమర్పించింది.