తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Central on Amaravati Plots: రాజధానిలో ఇళ్ల నిర్మాణంపై రాష్ట్రానికి కేంద్రం షాక్‌.. కోర్టు కేసులు తేలాక చూద్దాం అంటూ మెలిక

Central Government on Land Plots: రాజధాని అమరావతిలో బయటి వారికి ఇళ్ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇచ్చింది. కోర్టు కేసులు తేలిన తర్వాత ఇళ్ల సంగతి చూద్దామని స్పష్టం చేసింది. అది కూడా ఇళ్ల పథకం గడువు ముగిసేలోగా కేసులు పరిష్కారమైతేనే నిధులిస్తామని షరతు విధించింది. లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చుతో ఇళ్లు నిర్మించాల్సి వస్తుందని.. తాజాగా విడుదల చేసిన C.S.M.C సమావేశం మినిట్స్‌లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

shock to state government
shock to state government

By

Published : Jul 6, 2023, 7:44 AM IST

రాజధానిలో ఇళ్ల నిర్మాణంపై రాష్ట్రానికి కేంద్రం షాక్‌

Central Shock to State Government: బయటి ప్రాంతాలకు చెందిన 47 వేల 17 మందికి రాజధానిలో ఇళ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణానికి సన్నాహాలు చేయడంపై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ.. దూకుడు ప్రదర్శిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఝలక్ ఇచ్చింది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో బలహీనవర్గాలకు గతంలో కేటాయించిన 46 వేల 928 ఇళ్లను రద్దు చేసి, వాటికి బదులుగా రాజధానిలో “PMAY-అర్బన్‌" కింద 47వేల 17 ఇళ్లు మంజూరు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి.. గత నెల 26న జరిగిన సెంట్రల్‌ శాంక్షనింగ్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ - C.S.M.C 67వ సమావేశం ఆమోదం తెలిపింది. అయితే కోర్టు కేసులు తేలాకే ఇళ్ల నిర్మాణానికి నిధులిస్తామని షరతు పెట్టింది. అదీ ఈ పథకం గడువు ముగిసేలోగా కోర్టు కేసులు పరిష్కారమైతేనే నిధులిస్తామని తేల్చిచెప్పింది. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చుతో ఇళ్లు నిర్మించాల్సి వస్తుందని.. తాజాగా విడుదల చేసిన C.S.M.C సమావేశం మినిట్స్‌లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్రం వేడుకున్నా... కేంద్రం ‘నో’: రాజధాని అమరావతిలో బయటి ప్రాంతాలకు చెందినవారికి స్థలాలు కేటాయించేందుకు.. C.R.D.A చట్టాన్ని సవరించి, మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేసి మరీ రాష్ట్ర ప్రభుత్వం R5 జోన్‌ను సృష్టించింది. విజయవాడ, పెదకాకాని, దుగ్గిరాల, మంగళగిరి ప్రాంతాలకు చెందిన 47 వేల 17 మందికి రాజధానిలో పట్టాలిచ్చింది. బయటి ప్రాంతాల వారికి రాజధానిలో పట్టాలు ఇవ్వడంపై కొందరు హైకోర్టును, ఆపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తుది తీర్పునకు లోబడే ఆ స్థలాలపై పట్టాదారులకు హక్కు దఖలు పడుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం.. లబ్ధిదారులకు ఇచ్చిన పట్టాల్లోనూ ప్రస్తావించింది. అయితే కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ అక్కడ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని వేరే ప్రాంతాల్లో మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేసి, రాజధానిలో నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ఆ ఇళ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని, ఒకవేళ కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తే నిధుల్ని తిరిగి ఇచ్చేస్తామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. కోర్టు కేసులు పరిష్కారమయ్యాకే నిధులు విడుదల చేస్తామని, ప్రస్తుతానికి ఇళ్లను మాత్రం మంజూరు చేస్తామని స్పష్టం చేసింది.

గడువులోగా ఇళ్లు ఎందుకు కట్టడం లేదు?: బెనిఫిషియరీ లెడ్‌ కన్‌స్ట్రక్షన్‌ - B.L.C కింద రాష్ట్రానికి కేటాయించిన 7.15 లక్షల ఇళ్లను జియోట్యాగింగ్‌ చేసినా... ఇప్పటివరకూ ప్రారంభం కాలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2023 జూన్‌లో 1.10 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించాల్సి ఉన్నట్లు తెలిపింది. కేటాయించిన ఇళ్ల నిర్మాణం పూర్తిచేయడానికి తగిన సమయం నిర్దేశించుకోవాలని C.S.M.C సూచించింది. టిడ్కో ప్రాజెక్ట్‌ కింద ఇళ్ల కేటాయింపు, ఆక్యుపెన్సీ ఇంకా చేయలేదని... పూర్తయిన ఇళ్లలో లబ్ధిదారులు చేరేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిర్దేశించింది. P.M.A.Y-U కింద కేటాయించిన నిధుల్లో 13వందల 73.76 కోట్లు ఖర్చు కాకుండా మిగిలి ఉన్నట్లు తెలిపింది. 145 కోట్ల రూపాయల నిధుల వినియోగంపై ధ్రువపత్రాలను అత్యవసరంగా సమర్పించాలని తేల్చిచెప్పింది.

J.N.U.R.M కింద ఎక్కువగా ఉపయోగించిన 52 కోట్లు తిరిగి చెల్లించాలని నిర్దేశించింది. J.N.U.R.M కింద కట్టిన 2వేల 757 ఇళ్లలో ఇప్పటివరకూ ఎవరూ చేరలేదని, వెంటనే లబ్ధిదారులకు కేటాయించాలని సూచించింది. ఇదివరకు 148 ప్రాజెక్టుల్లో కేటాయించిన ఇళ్లలో 46 వేల 928 ఇళ్లను తగ్గించాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు C.S.M.C ఆమోదముద్ర వేసింది. ఈ ప్రాజెక్టులకు ఏమైనా నిధులు విడుదల చేసి ఉంటే... ఆ మొత్తాన్ని తదుపరి ఇచ్చే నిధుల్లో రాష్ట్రానికి సర్దుబాటు చేస్తామని పేర్కొంది. ఈ ఇళ్ల తగ్గింపుతో అర్హులైన లబ్ధిదారులెవరూ నష్టపోకూడదని స్పష్టంచేసింది. భవిష్యత్తులో ఎదురయ్యే వివాదాల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు గుర్తించిన లబ్ధిదారుల పేర్ల రికార్డులు, డాక్యుమెంట్లు భద్రపరచాలని ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details