తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశమంతా అట్టుడుకుతున్నా.. 'అగ్నిపథ్‌' అమలుకే కేంద్రం నిర్ణయం.. - అగ్నిపథ్‌ అమలుకే కేంద్రం నిర్ణయం

అగ్నిపథ్​ను వ్యతిరేకిస్తూ.. దేశమంతా ఓ వైపు అట్టుడికిపోతోంది. మరోవైపు.. ఇదేమీ పట్టనట్టు కేంద్ర ప్రభుత్వం మాత్రం పథకాన్ని అమలు చేస్తేందుకే మొగ్గు చూపుతోంది. అగ్నిపథ్​ నియామక ప్రక్రియ షెడ్యూల్​ను అతి త్వరలో ప్రకటిస్తామని ఆర్మీ చీఫ్​ మనోజ్​ పాండే తెలిపారు.

central decision to implement the Agnipath scheme
central decision to implement the Agnipath scheme

By

Published : Jun 18, 2022, 5:30 AM IST

సైనిక నియామకాల కోసం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్‌' పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నా.. కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ దాన్ని కొనసాగించేందుకే బలంగా నిర్ణయించుకుంది. పలువురు కేంద్రమంత్రులు ‘అగ్నిపథ్‌’కు మద్దతుగా శుక్రవారం గట్టి గళం వినిపించారు. మరోవైపు ఈ పథకంపై ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌ అధిపతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం కింద నియామక ప్రక్రియలకు అతి త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. యువత దేశానికి సేవ చేసేందుకు ‘అగ్నిపథ్‌’ ఓ సువర్ణావకాశం అని, ఈ పథకం కింద నియామక ప్రక్రియ ‘కొన్నిరోజుల్లో’ ప్రారంభమవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం ట్విటర్‌లో స్పష్టం చేశారు. మరోవైపు ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే స్పందిస్తూ.. ఆర్మీలో చేరడానికి సిద్ధమైన ఎంతో మంది యువతకు గత రెండేళ్లలో కొవిడ్‌ పరిస్థితుల కారణంగా ఆ అవకాశం దక్కలేదని, అర్హత వయసు పరిమితి పెంపు ద్వారా వారందరికీ ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. ‘అగ్నిపథ్‌’ నియామక ప్రక్రియ షెడ్యూల్‌ను అతి త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

జూన్‌ 24 నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో నియామకాలు: ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌

‘అగ్నిపథ్‌’ పథకం కింద ఎయిర్‌ ఫోర్స్‌ విభాగంలో ఈ నెల 24 నుంచి నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధరీ శుక్రవారం వెల్లడించారు. సాధారణంగా ఈ ఉద్యోగాలకు వయోపరిమితి 17.5-21 ఏళ్లు అని, అయితే ఈ ఏడాదికి మాత్రం గరిష్ఠ పరిమితిని ప్రభుత్వం 23 ఏళ్లకు పెంచిందని చెప్పారు.

వారంలోపు నేవీలో..

ఈ పథకం కింద నౌకాదళంలో నియామక ప్రక్రియను అతి త్వరలోనే చేపట్టనున్నట్లు నేవీ విభాగం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ వారంలోపు విడుదలవుతుందని నేవీ సీనియర్‌ కమాండర్‌ ఒకరు చెప్పారు.

దేశానికి సేవ చేస్తూనే ఉజ్వల భవిష్యత్తుకు పునాది: అమిత్‌ షా

యువత దేశానికి సేవ చేస్తూనే, ఉజ్వల భవిష్యత్తు పొందడానికి ‘అగ్నిపథ్‌’ పథకం దోహదం చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లు ఇబ్బంది పడ్డ యువత ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాదికిగానూ అర్హత వయసు పరిమితిలో రెండేళ్ల సడలింపు ఇచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ట్వీట్‌ చేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details