Central Cabinet Expansion: కేంద్ర మంత్రివర్గాన్ని త్వరలో విస్తరించే అవకాశం ఉంది. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు దీనిలో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ నెల 29న ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందుగానే విస్తరణ చేపట్టవచ్చు. మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి ఒక్కొక్కరికి చోటుదక్కే అవకాశాలున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఏడాది మే 31న తొలి మంత్రివర్గం ఏర్పడింది. 2021 జులై ఏడో తేదీన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. ప్రధానమంత్రితో కలిపి 31 మంది కేబినెట్ మంత్రులు, ఇద్దరు స్వతంత్ర హోదా మంత్రులు, 45 మంది సహాయ మంత్రులు (మొత్తం 78 మంది) ప్రస్తుతం ఉన్నారు. కేంద్రంలో గరిష్ఠంగా 83 మంది వరకు మంత్రులుగా ఉండే అవకాశం ఉంది.
త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ!.. ఏపీ, తెలంగాణ నుంచి ఒక్కొక్కరికి అవకాశం? - కేంద్ర మంత్రివర్గం వార్తలు
కేంద్ర మంత్రివర్గాన్ని త్వరలో విస్తరించే అవకాశం ఉంది. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు దీనిలో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ నుంచి ఒక్కొక్కరికి అవకాశం దక్కనున్నట్లు సమాచారం.
కేంద్రానికి రానున్న శివరాజ్‌సింగ్?
ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కర్ణాటకలు భాజపాకు ఎంతో కీలకం. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను మార్చే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అక్కడ 2003 నుంచి ఒక ఏడాది మినహా మిగిలిన కాలమంతా భాజపానే అధికారంలో ఉంది. అందులో 2005 నుంచి ఏడాది మినహా శివరాజ్‌సింగ్ చౌహానే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో ఆయనను కేంద్ర మంత్రివర్గంలో తీసుకొని అక్కడ ముఖ్యమంత్రిగా వేరొకరిని నియమించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లను గెలుచుకునేందుకు వీలుగా మంత్రివర్గ విస్తరణలో ఆ రాష్ట్రాలకు పెద్దపీట వేయనున్నారు. కర్ణాటక, త్రిపురల్లో భాజపా అధికారంలో ఉన్నా ఆ రెండు ప్రభుత్వాలపై వ్యతిరేకత, పార్టీలో అసమ్మతులను సర్దుబాటు చేసేలా కసరత్తు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని వరించేనో?
తెలంగాణలో భాజపాకు నలుగురు ఎంపీలు ఉన్నారు. వీరిలో ఒకరైన జి.కిషన్‌రెడ్డి ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా ఉన్నారు. తెలంగాణపై భారీ ఆశలు పెట్టుకున్న భాజపా.. ఈ విడత మంత్రివర్గ విస్తరణలో మరొకరికి స్థానం కల్పించే అవకాశం ఉంది. భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, అర్వింద్, లక్ష్మణ్, సోయం బాపురావు తెలంగాణ నుంచి ఎంపీలుగా ఉన్నారు. మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కలేదు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిన్నర మాత్రమే ఉండడం, ఇదే చివరి మంత్రివర్గ విస్తరణగా భావిస్తున్నందున ఈసారి ఒకరికి అవకాశం ఇవ్వవచ్చని భావిస్తున్నారు. ఏపీకి చెందిన సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు (యూపీ నుంచి) రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు.