Central Cabinet Decisions Today :ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కీలక ప్రకటనలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. బీసీ కులవృత్తులకు అండగా ఉండడమే లక్ష్యంగా ప్రకటించిన 'విశ్వకర్మ' పథకానికి రూ. 13,000 కోట్లు కేటాయించింది. విశ్వకర్మ పథకం ద్వారా చేతివృత్తుల వారికి రూ. 2 లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది.
Vishwakarma Scheme Details : రోజుకు 500 రూపాయల ఉపకార వేతనంతో శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనున్నట్లు తెలిపిన కేంద్రం.. ఆ తర్వాత పరికరాల కొనుగోలు చేసేందుకు రూ.15 వేలు ఆర్థిక సాయం అందించనుంది. శిక్షణ తర్వాత 5శాతం వడ్డీతో లక్ష రూపాయల రుణం ఇవ్వనుంది. తొలి విడత రుణం సద్వినియోగం చేసుకుంటే అదనంగా మరో లక్ష రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 17న ప్రారంభం కానున్న ఈ పథకం ద్వారా 30లక్షల మంది సంప్రదాయ చేతివృత్తి కళాకారులు, చేనేత కార్మికులు, స్వర్ణకారులు, కులవృత్తులు చేసేవారు లబ్ధిపొందనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
PM E Bus Seva News In Telugu : అలాగే పీఎం ఈ-బస్ సేవా పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదంతెలిపింది. దేశవ్యాప్తంగా 10 వేల ఈ-సిటీ బస్సులను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో 169 నగరాల్లో ఈ-సిటీ బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిన కేంద్రం.. ఇందుకు రూ. 77,613 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది. 3లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలకు.. ఈ బస్సులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ తెలిపారు.