Modi Punjab rally: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రధాని మోదీ ప్రారంభించాల్సిన రూ.వేల కోట్ల అభివృద్ధి పనులను అడ్డుకోవటం బాధాకరమని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రజలు ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకోవాలని పోలీసులకు ఆదేశాలు వెళ్లాయని ఆరోపించారు.
Modi punjab security
"పంజాబ్ ప్రభుత‌్వం అనుసరించిన వ్యూహాలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేవారికి బాధ కలిగించేలా ఉన్నాయి. సభకు ప్రజలు హాజరుకాకుండా చూడాలని రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని పర్యటనకు ఆటంకం ఎదురైన సమయంలో.. ఈ సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీ.. ఫోన్లో కూడా అందుబాటులో లేరు."
-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు
అది కుట్రే: అమిత్ షా
Amit shah on Modi Punjab rally: ప్రధాని మోదీ కాన్వాయ్‌ను అడ్డుకోవటాన్ని కాంగ్రెస్ కుట్రగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ దుశ్చర్యలకు ఈ ఘటనే నిదర్శనమన్నారు. వరుస ఓటములతో సహనం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. ఇలాంటి చర్యలకు పాల్పడుతోందన్నారు. ఈ ఘటనకు కాంగ్రెస్ పెద్దలు క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి పాలన విధించాలి: అమరీందర్
పంజాబ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమైనట్లు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్ ఆరోపించారు. ఈ విషయంలో పంజాబ్ సీఎం, హోంమంత్రి ఘోరంగా వైఫల్యం చెందినట్లు విమర్శించారు. పంజాబ్ సీఎం, హోంమంత్రులకు అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు.
"రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో చన్నీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉంది. పాకిస్థాన్ సరిహద్దుకు 10కిలోమీటర్ల దూరంలో మోదీ సభాస్థలి ఉంది. ప్రధాని పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేకపోతే.. ఇంకా ఏం చేయగలదు? మనకు బలమైన ప్రభుత్వం కావాలి. ఈ ముఖ్యమంత్రి, హోం మంత్రి అధికారంలో కొనసాగే అర్హత లేదు. వెంటనే రాజీనామా చేయాలి."