తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొత్త 'స్ట్రెయిన్'పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ - strain virus news

భారత్​లో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్​ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులకు లేఖ రాసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

Center letter to states on new coronavirus strain out break in India
దేశంలో 'స్ట్రెయిన్' వ్యాప్తి- రాష్ట్రాలకు కేంద్రం లేఖ

By

Published : Dec 30, 2020, 3:38 PM IST

దేశంలో కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్రం. వైరస్‌ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ కార్యదర్శులకు లేఖ రాశారు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌. ఈ నెల 21 నుంచి 23 వరకు బ్రిటన్‌ నుంచి వచ్చిన ప్రతి ప్రయాణికుడికి ఆర్‌టీ-పీసీఆర్​ పరీక్ష తప్పనిసరిగా చేయాలని సూచించారు.

'అనుమానం వస్తే.. పుణెకు పంపాలి'

ఆర్‌టీ-పీసీఆర్​ పరీక్షలో పాజిటివ్‌ వచ్చిన వారిని సంస్థాగత నిర్భంధం (ఇన్​స్టిట్యూషన్​ ఐసోలేషన్‌)లోకి పంపాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు అగర్వాల్‌. సాధారణ కొవిడ్​ రోగులతో కాకుండా.. ప్రత్యేకంగా ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనుమానం ఉన్న శాంపిల్స్‌ను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు లేదా.. జీనోమ్‌ పరీక్షలు నిర్వహించే అనుమతులు ఉన్న ల్యాబ్‌కు పంపాలన్నారు. పాజిటివ్‌ వచ్చిన వారితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ కనిపెట్టి వారికి కూడా పరీక్షలు నిర్వహించాలని నిర్దేశించారు.

బ్రిటన్​ మీదగా ప్రయాణించినా..

ఎయిర్‌పోర్ట్‌లో జరిపిన ఆర్‌టీ-పీసీఆర్​ పరీక్షలో నెగెటివ్‌ వచ్చిన వారిని తమ ఇళ్ల నుంచి బయటకు రాకుండా.. హోం ఐసోలేషన్‌లోనే ఉండేలా చూడాలని కేంద్రం సూచించింది. గత నెల రోజుల కాలంలో బ్రిటన్‌ నుంచి వచ్చిన, బ్రిటన్‌ మీదగా ప్రయాణించిన వారంతా అవకాశం ఉన్నంత త్వరగా జిల్లా స్థాయి పర్యవేక్షణ అధికారిని సంప్రదించాలని కోరింది. జిల్లా ఆరోగ్య కేంద్రంలో.. అందరికీ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించేలా జిల్లా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని ఆరోగ్య కార్యదర్శులకు సూచించింది.

అలసత్వం వద్దు

పాజిటివ్‌ వచ్చిన ప్రతి ఒక్కరినీ ప్రత్యేక సంస్థాగత క్వారంటైన్‌ కేంద్రాల్లో తగిన జాగ్రత్తలతో ఉంచాలని.. 5 నుంచి 10 రోజుల కాలంలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది కేంద్రం. కరోనా, కరోనా స్ట్రెయిన్‌ విషయంలో అలసత్వం ప్రదర్శించకుండా.. ఇప్పటికే ఐసీఎంఆర్‌ ఇచ్చిన సూచనలు, మార్గదర్శకాలను తప్పక పాటించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర ఆరోగ్య శాఖ.

ఇదీ చూడండి:'న్యూఇయర్ వేడుకలపై నిఘా'

ABOUT THE AUTHOR

...view details