కొవాగ్జిన్ అనుమతులపై వస్తున్న విమర్శలను కేంద్ర ప్రభుత్వం మరోసారి గట్టిగా తిప్పికొట్టింది. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత, దీనికి ఉత్పరివర్తనం చెందే వైరస్‌పై పనిచేసే సత్తా ఉందని నిరూపితమైన తర్వాతే ప్రజాప్రయోజనాల దృష్ట్యా అత్యవసర వినియోగ అనుమతులిచ్చినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ తెలిపారు. "మూడోదశ ప్రయోగ పరీక్షల డేటాను ప్రచురించక ముందే కొవాగ్జిన్‌ను ప్రజలకు అందించడానికి అనుమతిచ్చిన విషయాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుందా? 26 చోట్ల నిర్వహించిన మూడోదశ ట్రయల్స్‌లో కొవాగ్జిన్ ..'కొత్త ఔషధం, మానవులపై ప్రయోగాల నిబంధనలు-2019'ని అనుసరించలేదన్న విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసా? 2020 డిసెంబర్ 30 నుంచి 2021 జనవరి 2 మధ్య కాలంలో జరిగిన సమావేశాల్లో భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) విషయ నిపుణుల కమిటీ సభ్యులు కొవాగ్జిన్ విషయంలో తమ అభిప్రాయాలను మార్చుకొని, మానవులపై ప్రయోగాల పద్ధతి (క్లినికల్ ట్రయల్ మోడ్)లో అనుమతులు ఇచ్చారా?" అని లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి విస్పష్టమైన సమాధానం ఇచ్చారు.
"కొత్త ఔషధం, మానవులపై ప్రయోగాల నిబంధనలు-2019 ప్రకారం భారత్ బయోటెక్ సంస్థ కెమిస్ట్రీ, మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ కంట్రోల్ (సీఎంసీ), నాన్ క్లినికల్ (జంతువులపై అధ్యయనం) డేటాను పూర్తిగా సమర్పించింది. ఆ సమాచారాన్ని కేంద్ర ఔషధ నియంత్రణ మండలి ఆధ్వర్యంలోని విషయ నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) మదింపుచేసిన అనంతరమే కొవాగ్జిన్ తయారీ, మార్కెటింగ్‌కు అనుమతిచ్చారు. భారత్ బయోటెక్ సంస్థ ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి దేశంలో నిర్వహించిన ఫేజ్ 1, 2 క్లినికల్ ట్రయల్స్ డేటా, దేశంలో కొనసాగుతున్న మూడోదశ క్లినికల్ ట్రయల్స్ డేటాను సమర్పించింది. ఈ మొత్తంపై కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ... విషయ నిపుణుల కమిటీ సభ్యులతో సమీక్షించింది. ఇది ఇన్‌యాక్టివేటెడ్ హోల్ వైరియోన్ కరోనా వ్యాక్సిన్ అని, ఉత్పరివర్తనం చెందే వైరస్‌పై ప్రభావం చూపే శక్తి దీనికి ఉందని నిపుణుల కమిటీ గుర్తించింది. ప్రస్తుతం 25,800 మంది భారతీయులపై విస్తృతమైన ట్రయల్ జరుగుతోంది. ఈ రోజు వరకూ వాక్సిన్ సురక్షితమేనని తేలింది."
-భారతీ ప్రవీణ్ పవార్ , కేంద్ర మంత్రి.