తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ అధికారం రాష్ట్రాలకు ఇవ్వండి' - మరాఠా రిజర్వేషన్లు

ఎస్​ఈబీసీ రిజర్వేషన్ల జాబితాలో కొత్తవాటిని చేర్చడంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంను కోరింది. ఈ మేరకు గురువారం రివ్యూ పిటిషన్​ను దాఖలు చేసింది. రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు ఇవ్వాలని కోరింది.

sebc reservation, మరాఠా రిజర్వేషన్లు
సుప్రీంకోర్టులో కేంద్రం పిటీషన్

By

Published : May 14, 2021, 7:15 AM IST

సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఎస్‌ఈబీసీ) జాబితాలో కొత్తవాటిని చేర్చే అధికారం 102వ రాజ్యాంగ సవరణ ప్రకారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాల్సిందిగా కోరుతూ కేంద్ర ప్రభుత్వం గురువారం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని అందులో కోరింది. మరాఠాల కోటా చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ ఈనెల 5న జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చెప్పింది.

జాతీయ బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ.. విద్య, ఉద్యోగాలకు సంబంధించి ఎస్‌ఈబీసీ జాబితాలో కొత్త సామాజిక వర్గాలను జతచేసే అధికారాన్ని రాష్ట్రాల నుంచి తొలగిస్తూ చేసిన 102వ రాజ్యాంగ సవరణను సమర్థించింది. అదే సమయంలో జస్టిస్‌ రవీంద్ర భట్‌, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ హేమంత్‌గుప్తాలు ప్రత్యేక తీర్పు ఇస్తూ 102వ రాజ్యాంగ సవరణ తర్వాత ఎస్‌ఈబీసీ జాబితాలో సవరణలు చేసే అధికారాన్ని రాష్ట్రాలు కోల్పోయాయని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ తాజాగా కేంద్ర సామాజిక, న్యాయశాఖ పిటిషన్‌ దాఖలు చేసింది. ఎస్‌ఈబీసీ జాబితాను సవరించేందుకు రాష్ట్రాలకు ఉన్న అధికారాలను రద్దు చేయవద్దని కోరింది.

ఇదీ చదవండి :టైమ్స్​ గ్రూప్​ ఛైర్​పర్సన్​ జైన్​ మృతి- ప్రధాని సంతాపం

ABOUT THE AUTHOR

...view details