తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుట్టలుగా మృతదేహాలు.. ఖాళీలేని శ్మశానాలు! - భయాందోళనలో మధ్యప్రదేశ్​ ప్రజలు

గుట్టలుగా కరోనా మృతదేహాలు.. ఖాళీగా లేని శ్మశాన వాటికలు.. ఇవీ మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ మరణాల విషయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వాస్తవ పరిస్థితులను దాచి పెడుతోందని సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

cemeteries in MP
గుట్టలుగా మృతదేహాలు.. ఖాళీలేని శ్మశానాలు!

By

Published : Apr 14, 2021, 5:25 PM IST

Updated : Apr 14, 2021, 7:28 PM IST

మధ్యప్రదేశ్​లో ఖాళీలేని శ్మశనాలు

'గుట్టలుగా కరోనా మృతదేహాలు.. శవాలను మోసుకొచ్చి, వంతుకోసం వరసగా నిలుచున్న అంబులెన్సులు.. కన్నీటిని దిగమింగుతూ అంత్యక్రియల కోసం వేచి చూస్తున్న బంధువులు.. ఖాళీగా లేని శ్మశాన వాటికలు.. ఇవీ మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు..' అంటూ వార్తా కథనాలు వెలువడుతున్నాయి. 1984లో భోపాల్ విష వాయువు దుర్ఘటన తర్వాత మరోసారి అలాంటి దుర్భర పరిస్థితులను ఇప్పుడు చూస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు మరణాల విషయంలో వాస్తవ పరిస్థితులకు, అధికార గణాంకాలకు మధ్య తేడా ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

భోపాల్​లో కలపతో శవాల దహనం

రెండో దశలో.. కరోనా వైరస్ మహమ్మారి ఉగ్రరూపం చూపిస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా మరణాలు సంభవించాయి. 281 మరణాలతో మహారాష్ట్ర ముందు వరసలో ఉండగా.. చత్తీస్‌గఢ్‌లో 156, ఉత్తర్‌ప్రదేశ్‌లో 85 మంది ప్రాణాలు విడిచారు. మధ్యప్రదేశ్‌లో ఆ సంఖ్య 40గా ఉంది. అయితే అక్కడి వాస్తవ పరిస్థితులను గమనిస్తే ఆ సంఖ్య ఎక్కువగా ఉంటుందనిపిస్తోంది.

రాజధాని భోపాల్‌లోని బాద్భదా శ్మశాన వాటికలో ఇంతకు ముందెన్నడూ కనిపించని పరిస్థితులు నెలకొన్నాయని కొవిడ్ మృతుడి బంధువు ఒకరు వెల్లడించారు. 'భోపాల్ గ్యాస్‌ దుర్ఘటన సమయంలో నేను తొమ్మిదో తరగతి చదువుతున్నా. ఈ తరహా పరిస్థితులను అప్పుడు చూశా. కేవలం నాలుగు గంటల్లో 30 నుంచి 40 మృతదేహాలు ఇక్కడకు వచ్చాయి' అని ఓ వ్యక్తి వెల్లడించారు. అతడు కూడా తన సోదరుడి అంత్యక్రియల కోసమే అక్కడకు వచ్చారు. శవాలను దించేందుకు అంబులెన్సులు వేచి ఉన్నాయని, చితి పేర్చేందుకు కూడా స్థలం దొరకడం లేదని మరికొందరు చెప్పారు.

మధ్యప్రదేశ్​లో ఖాళీలేని శ్మశానాలు

మరణాల సంఖ్య దాస్తోందా?

సోమవారం ఒక్క బాద్భదా శ్మశాన వాటికకే 37 మృతదేహాలు వచ్చినట్లు సమాచారం. కానీ ఆరోగ్య శాఖ మాత్రం రాష్ట్రంలో మొత్తం 37 మరణాలు సంభవించినట్లు రోజూవారీ నివేదికలో పేర్కొంది. కొద్దిరోజుల నుంచి గణాంకాల్లో ఇదే తంతు కనిపిస్తోందని ఓ వార్తా కథనం పేర్కొంది. అయితే ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. 'మరణాల సంఖ్యను దాచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. అలా చేస్తే మాకేం బహుమానాలు రావు' అంటూ మంత్రి విశ్వాస్ సారంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు శవాలను దహనం చేసేందుకు కలప కొరత కూడా తీవ్రంగా ఉన్నట్లు బాధితులు తెలిపారు. నిత్యం 40 నుంచి 45 శవాలు వస్తుండటంతో కట్టెలు కూడా అందుబాటులో లేవన్నారు. 'శవాల రాకతో పని భారం పెరిగి, అలసటగా అనిపిస్తోంది. అన్నం తినడానికి కూడా సమయం దొరకడం లేదు' అని అక్కడ పనిచేసే వ్యక్తి ఒకరు చెప్పారు. చేతులు బొబ్బలు కడుతున్నాయని మరొకరు వాపోయారు.

మధ్యప్రదేశ్​లో గుట్టలుగా కొవిడ్ మృతదేహాలు

ఛత్తీస్‌గఢ్‌లోనూ ఆందోళనకరం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అకస్మాత్తుగా కేసులు, మరణాల సంఖ్య పెరగడం సవాలుగా మారిందని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి టీఎస్ సింఘ్ డియో ఆందోళన వ్యక్తం చేశారు. రాయ్‌పూర్, దుర్గ్‌లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని, మృతదేహాలు పేరుకుపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. రాయ్‌పూర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ మెమోరియల్ ఆసుపత్రిలోని శవాగారంలో స్థలం దొరక్క, దాని బయటే స్ట్రెచర్లపై మృతదేహాలను ఉంచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఇదీ చదవండి:'ఎస్-400 క్షిపణి ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం'

Last Updated : Apr 14, 2021, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details