ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తాం- 'సీ విజిల్' ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు: CEC CEC Meeting on Election Preparations in AP: ఈ ఏడాది ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో తొలుత ఆంధ్రప్రదేశ్‌ను సందర్శిస్తున్నట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల సన్నద్ధత, పోలింగ్ స్టేషన్లల్లో ఏర్పాట్లపై ఏపీ సీఈవో సహా వివిధ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలతో విజయవాడలో సీఈసీ సమావేశం నిర్వహించింది. సీఈసీ రాజీవ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఆదాయపు పన్ను, కస్టమ్స్, జీఎస్టీ తదితర విభాగాల అధికారులు హాజరయ్యారు. పోలింగ్ సిబ్బంది ఎంతమంది అందుబాటులో ఉన్నారనే అంశంపై సమీక్షించారు.
ఎన్నికల సన్నద్ధతపై సీఈసీ బృందానికి ఏపీ సీఈఓ ఎంకే మీనా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలను వివరించారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులు, పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను వెల్లడించారు. గత డిసెంబరు 9 వరకూ వచ్చిన వేర్వేరు దరఖాస్తులను పరిష్కరించామని మీనా తెలిపారు. డిసెంబరు 9 తేదీ తర్వాత వచ్చిన 17,976 దరఖాస్తులను కూడా ఒకటి రెండు రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. మృతి చెందిన ఓటర్లు, డూప్లికేట్ ఓట్లు వంటి వాటిని తొలగించామని సీఈఓ వెల్లడించారు.
అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 14.48 లక్షల ఓటర్ల పేర్లను గుర్తించామని వివరించారు. అందులో 5.64 లక్షల పేర్లను అనర్హులుగా గుర్తించి తొలగించామని చెప్పారు. ఫాం-7లను గంపగుత్తగా దాఖలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. కాకినాడ, పర్చూరు, గుంటూరు పశ్చిమ వంటి సెగ్మెంట్లల్లో ఫాం-7 దుర్వినియోగం చేసేవారిపైనా కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఉరవకొండ, ప్రొద్దుటూరు నియోజకవర్గాల ఈఆర్వోలు, పర్చూరు ఏఈఆర్వో, ఒక సీఐ, ముగ్గురు ఎస్ఐలను సస్పెండ్ చేశామని తెలిపారు.
50 మంది బీఎల్వోలపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలిచ్చామని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం సూచనల మేరకు జరుగుతున్న బదిలీలను పర్యవేక్షిస్తున్నట్లు ఎంకే మీనా సీఈసీకి వివరించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పోలీసు విభాగం నోడల్ అధికారి, కేంద్ర పోలీసు బలగాల నోడల్ అధికారులు హాజరయ్యాకరు. ఎన్నికల కోడ్ అమలు సమయం నుంచి ఎన్నికల నిర్వహణ వరకూ తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సీఈసీ అధికారులకు సూచనలు ఇచ్చింది.
ఏపీలో మొత్తం 46వేల 165 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని ఏపీ సీఈవో మీనా తెలిపారు. లోక్ సభ ఎన్నికలు కూడా ఉండటంతో పోలింగ్ స్టేషన్లో ఆరుగురు ఉండాలని లెక్కలు వేశారు. ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 2.75 లక్షల మందికి పైగా సిబ్బంది అవసరమవుతారని అంచనాకు వచ్చారు. బీఎల్వోలుగా సుమారు 30 వేల మంది సచివాలయ సిబ్బందిని నియమించామన్నారు.
ఎన్నికల నిర్వహణ కోసం సుమారు 60 వేల మంది సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని అధికారులు వెల్లడించారు. సచివాలయ సిబ్బందిని పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దన్న పార్టీల విజ్ఞప్తులపై సమావేశంలో ప్రస్తావించారు. ఎన్నికలకు సిబ్బంది కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఈసీ సూచించింది. టీచర్లకు ఎన్నికల విధులు అనివార్యమనిసీఈసీ వెల్లడించింది.
ఈనెల 22న ఓటర్ల తుది జాబితా ప్రచురణ ప్రక్రియ పూర్తి కానుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సగటున ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 870 మంది ఓటర్లు ఉన్నారని, కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 1500 వరకు ఓట్లు ఉన్నాయని తెలిపారు. 32,316 (70 శాతం) పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకుంటే సీ విజిల్ యాప్ ద్వారా ఎవరైనా ఈసీకి ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. సీ విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని అన్నారు.
రాజకీయ నాయకులకు తలొగ్గితే తప్పుకోవాల్సిందే - అధికారులకు సీఈసీ స్వీట్ వార్నింగ్!
"ఈ ఏడాది ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా తొలుత ఆంధ్రప్రదేశ్ సందర్శిస్తున్నాం. ఎన్నికల సందర్భంగా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తాం. ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఓటర్లను కోరుతున్నాం. నిన్న విజయవాడలో పార్టీలతో సమావేశం నిర్వహించాం. ఓటర్ల జాబితాలో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ కోరింది. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని కొన్ని పార్టీలు కోరాయి. ఏపీ, తెలంగాణలోనూ ఓట్ల నమోదుపై ఓ పార్టీ ప్రస్తావించింది. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తాం. ఏపీలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో మహిళా ఓటర్లు 2.07 కోట్లు, పురుష ఓటర్లు 1.99 కోట్ల మంది ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం శుభపరిణామం" -రాజీవ్ కుమార్, సీఈసీ
"ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశం కల్పిస్తున్నాం. వందేళ్లు దాటిన వృద్ధులు 1174 మంది ఉన్నారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 7.88 లక్షలు. గతంలో 20 లక్షలకుపైగా ఓట్లను తొలగించారు. అందులో 13 వేల ఓట్లను అక్రమంగా తొలగించినట్టు గుర్తించాం. అలాంటి ఓట్లను పునరుద్ధరించాం. ఈనెల 22న ఓటర్ల తుది జాబితా ప్రచురణ ప్రక్రియ పూర్తి కానుంది. రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సగటున ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 870 మంది ఓటర్లు ఉన్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 1500 వరకు ఓట్లు ఉన్నాయి. 32,316 (70 శాతం) పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తాం. ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకుంటే సీ విజిల్ యాప్ ద్వారా ఎవరైనా ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు. సీ విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటాం" -రాజీవ్ కుమార్, సీఈసీ
విజయవాడలో సీఈసీ పర్యటన - వైఎస్సార్సీపీ అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందా?