ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వానికి కీలక ప్రతిపాదన చేశారు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర. ప్రస్తుతం జనవరి 1 నాటికి పద్దెనిమిదేళ్లు నిండినవారికి మాత్రమే ఆ ఏడాది ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుండగా.. దీనికి అదనంగా మరో మూడు తేదీలను గుర్తించాలని కేంద్రాన్ని కోరారు. జనవరి 1 తర్వాత పద్దెనిమిదేళ్లు నిండిన వ్యక్తులు ఓటర్ నమోదు కోసం ఆ ఏడాదంతా ఎదురుచూడాల్సి వస్తోందని పేర్కొన్నారు. నాలుగు తేదీలను గుర్తిస్తే ఈ సమస్య ఉండదని చెప్పారు.
"ఓటర్ల నమోదుకు సంబంధించి అర్హత తేదీలను పెంచాలని నేను కోరుకుంటున్నాను. ఒకే కటాఫ్ తేదీ ఉండటం వల్ల జనవరి 2న పద్దెనిమిదేళ్లు నిండిన వ్యక్తి.. వచ్చే ఏడాదే ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇందుకోసం ఏడాది పాటు వేచి చూడాలి. కాబట్టి ఒక ఏడాదిలో నాలుగు తేదీలను ఇందుకోసం గుర్తిస్తే ఈ సమస్య ఉండదు."
-సుశీల్ చంద్ర, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్