సైనికాధికారుల పదవీ విరమణ వయసు పెంచడం సహా ముందస్తు పదవీ విరమణ తీసుకునే సైనిక సిబ్బంది పెన్షన్ మొత్తంలో కోత విధించాలని సైనిక వ్యవహరాల విభాగం డీఎంఏ ప్రతిపాదించింది. వైమానిక దళం, నౌకాదళంలోని అధికారుల పదవీవిరమణ వయసును కూడా పెంచాలని భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ నేతృత్వంలోని డీఎంఏ నిర్ణయించింది. సైనిక సంస్కరణల్లో భాగంగా.... సైన్యంలో కర్నల్ ర్యాంకు లేదా సరిసమానమైన ర్యాంకు గల అధికారుల విరమణ వయస్సును 54 నుంచి 57 ఏళ్లకు పెంచాలని సూచించింది.
ముందస్తు పదవీవిరమణ చేస్తే పెన్షన్‌లో కోతే.! - retirement age in indian army
ముందుస్తు పదవీ విరమణ తీసుకునే సైనిక సిబ్బంది పెన్షన్‌లో కోత విధించాలని సైనిక వ్యవహారాల విభాగం నిర్ణయించింది. సైన్యంలో పని చేసే అధికారుల పదవీ విరమణ వయసు పెంచడంపై కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో అధికారుల స్థాయిని బట్టి 56 ఏళ్లుగా ఉన్న పదవీ విరమణ కాలం మరో మూడేళ్లు పెరిగే అవకాశం ఉంది.
బ్రిగేడియర్ స్థాయి అధికారుల పదవీ విరమణ వయస్సును 56 నుంచి 58కి, మేజర్ జనరల్స్‌కు 58 నుంచి 59 ఏళ్లకు పెంచాలని డీఎంఏ ప్రతిపాదించింది. పింఛన్ అందించే విషయంలోనూ కొన్ని మార్పులు సిఫార్సు చేసింది. ప్రతిపాదిత పెన్షన్ పంపిణీ ప్రణాళిక ప్రకారం, 35 ఏళ్ల సర్వీస్ ఉన్నవారు మాత్రమే పూర్తి పెన్షన్‌కు అర్హులు. ఇది చివరిగా డ్రా చేసిన జీతంలో 50 శాతం వస్తుంది. 20 నుంచి 25 ఏళ్ల సర్వీస్ ఉంటే 50 శాతం పెన్షన్‌ను తీసుకోవచ్చు. ఒకవేళ 26 నుంచి 30 ఏళ్ల సర్వీస్ ఉంటే 60 శాతం, 31 నుంచి 35 ఏళ్లు ఉంటే 75 శాతం ఫించన్‌ను తీసుకోవచ్చని డీఎంఏ ప్రతిపాదనలు చేసింది. ఏటా బడ్జెట్‌లో రక్షణ వ్యయం పెరగటం....దానిలో ఎక్కువ భాగం పెన్షన్‌లకే వెళ్తుండటం వల్ల ఈ విధమైన ప్రణాళికను రూపొందించినట్లు డీఎంఏ పేర్కొంది.