Bipin Rawat passed away: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మృతిపై విచారం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, ఆర్మీ అధికారుల మరణాలపై సంతాపం ప్రకటించారు. అత్యంత శ్రద్ధతో వారంతా దేశ సేవ చేశారని కొనియాడారు.
''జనరల్ బిపిన్ రావత్ అద్భుత సైనికుడు. నిజమైన దేశభక్తుడు. ఆయన మన సాయుధ బలగాలను, భద్రతా యంత్రాంగ ఆధునీకీకరణలో దోహదపడ్డారు. వ్యూహాత్మక విషయాలపై ఆయన ఆలోచనలు అసాధారణం. ఆయన మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఓం శాంతి.''
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి.
దేశం గొప్ప వీరుడిని కోల్పోయింది: రాష్ట్రపతి
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. దేశం గొప్ప వీరుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. ' దేశంలో తన ధీర కుమారుల్లో ఒకరిని కోల్పోయింది. మాతృభూమి కోసం ఆయన నాలుగ దశాబ్దాల నిస్వార్థ సేవ అసాధారణమైన శౌర్యం, వీరత్వమే తెలుపుతున్నాయి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. హెలికాప్టర్ ప్రమాదంపై చాలా బాధాకరం. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి నివాళులు. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. ' అని ట్వీట్ చేశారు.
వెంకయ్య దిగ్భ్రాంతి
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ' తమిళనాడు, కూనూర్‌లో హెలికాప్టర్ ప్రమాదానికి గురై.. సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య శ్రీమతి మధులిక రావత్, ఆర్మీ అధికారుల మృతి ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడి సంతాపం తెలిపా. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి.' అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
బాధాకరమైన రోజు: అమిత్ షా
సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇదో బాధాకరణైన రోజుగా అభివర్ణించారు. రావత్ సహా ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన చికిత్స పొందుతున్న.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు షా.