Mi 17 v5 helicopter: త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ సహా 13 మందిని బలితీసుకున్న దుర్ఘటనలో... హెలికాప్టర్ లోపమేదైనా ఉందా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఈ ప్రమాదంలో నేలకూలిన ఎంఐ-17వీ5 విశ్వసనీయమైందేనని సైనిక నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ రవాణా హెలికాప్టర్లలో ఒకటిగా నిలిచిన ఈ లోహవిహంగం బహుళ అవసరాలు తీర్చుతోంది. రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖుల ప్రయాణానికీ ఉపయోగపడుతోంది. దాదాపు 60 దేశాలు వీటిని వినియోగిస్తున్నాయి.
ఏమిటీ హెలికాప్టర్?
Kazan mi-17 v5: 'రష్యన్ హెలికాప్టర్స్'కు చెందిన కజాన్ సంస్థ ఎంఐ-17వీ5ను ఉత్పత్తి చేస్తోంది. ఇది మధ్యశ్రేణి రవాణా హెలికాప్టర్. మునుపటి ఎంఐ-8/17 తరగతి హెలికాప్టర్లలో ఇదే అధునాతనమైంది.
- వీటి కొనుగోలుకు భారత్ 2008లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. మొదట 80 లోహవిహంగాలకు ఆర్డర్లు ఇచ్చింది. తర్వాత వాటిని 151కి పెంచింది. ఇవి లాంఛనంగా 2012లో భారత వాయుసేనలో చేరాయి. ఎత్తయిన పర్వత ప్రాంతాల్లోకి సైనికులు, సరకులను రవాణా చేయడానికి బాగా ఉపయోగపడ్డాయి.
ఆధునిక కాక్‌పిట్ - పైలట్లకు సమస్త సమాచారాన్ని అందించడానికి ఎంఐ-17వీ5లో 4 మల్టీఫంక్షన్ డిస్ప్లేలు, అధునాతన దిక్సూచి వ్యవస్థలు ఉన్నాయి.
- వాతావరణ పరిస్థితులపై కన్నేసే రాడార్. రాత్రివేళ వీక్షణ కోసం అధునాతన నైట్ విజన్ సాధనాలు. ఆధునిక కేఎన్‌ఈఐ-8 ఏవియానిక్స్ వ్యవస్థ.
- పైలట్ విశ్రాంతి తీసుకునే సమయంలో ప్రయాణం కోసం పీకేవీ-8 ఆటోపైలట్ వ్యవస్థ.
- ఈ హెలికాప్టర్ రాత్రి పగలు తేడా లేకుండా పనిచేయగలదు. ఒక మోస్తరు స్థాయి ప్రతికూల వాతావరణంలోనూ విహరించగలదు. చదునుగా లేని నేలపై రాత్రివేళ కూడా దిగగలదు.
- సైనిక సిబ్బంది, సరకుల రవాణా. అవసరాన్ని బట్టి ఈ హెలికాప్టర్ ఉదర భాగానికి సరకులను వేలాడదీసి దూర ప్రాంతాలకు చేరవేయవచ్చు.
- శత్రు భూభాగంలో దాడి కోసం కమాండోలను జారవిడవచ్చు.