ఛండీగఢ్లో దారుణం జరిగింది. వీధికుక్కలకు ఆహారం అందిస్తున్న ఓ యువతిని.. వేగంగా వచ్చిన ఓ కారును ఢీ కొట్టింది. అనంతరం ఆమెను పట్టించుకోకుండా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం.. నిలకడగా ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటన శనివారం రాత్రి జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సెక్టార్ 53కు చెందిన 25 ఏళ్ల తేజశ్విత.. వీధి కుక్కలకు ఆహారం అందిస్తోంది. ఆమె తల్లి మంజిందర్ సైతం తేజశ్వితకు సాయం చేస్తోంది. ఎప్పటిలాగే శనివారం కూడా వీధి శునకాలకు ఆహారం అందించేందుకు తల్లికూతుర్లు కలిసి వెళ్లారు. ఈ క్రమంలోనే వేగంగా వచ్చిన ఓ కారు కుక్కలకు ఆహారం పెడుతున్న తేజశ్వితను ఢీ కొట్టి దూసుకెళ్లింది. దీనిని గమనించిన తల్లి.. వాహనదారులను సహాయం కోరింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదని బాధితురాలి తల్లి వాపోయింది.