12వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాల కేటాయింపులో పాటించనున్న మూల్యాంకన విధానాన్ని సీబీఎస్‌ఈ సుప్రీంకోర్టుకు సమర్పించింది. 30+30+40 ఫార్ములా ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించనున్నట్లు నివేదించింది.
జులై 31 నాటికి ఫలితాలను ప్రకటన ఉంటుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది ఏజీ కేకే వేణుగోపాల్ కోర్టుకు వివరించారు.
ఏంటీ 30+30+40?
30+30+40 ఫార్ములా ప్రకారం.. పదో తరగతి మార్కులకు 30 శాతం, 11వ తరగతి మార్కులకు 30 శాతం, 12వ తరగతి మార్కులకు 40 శాతం వెయిటేజీ కేటాయింపు ఉండనుంది.
పన్నెండో తరగతికి(cbse 12th result 2021) సంబంధించిన 40శాతం వెయిటేజీ లెక్కింపునకు యూనిట్, టర్మ్, ప్రాక్టికల్స్‌లో పొందిన మార్కులు పరిగణనలోకి తీసుకుంటారు.
పది, పదకొండో తరగతుల్లో కనబరిచిన ప్రతిభకు 30శాతం చొప్పున వెయిటేజీ ఇస్తారు. ఇందుకుగాను.. ఆయా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించిన ఐదింటి నుంచి ఉత్తమ మార్కులు సాధించిన మూడింటిని పరిగణనలోకి తీసుకుంటారు.
రిజల్ట్స్ కమిటీ..
తుది మార్కులు కేటాయింపు అంశంలో వివిధ పాఠశాలలు అవలంబించిన విధానాన్ని పర్యవేక్షించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఏజీ కేకీ వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. అదే విధంగా ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కుల పర్యవేక్షణకు ప్రతి పాఠశాల 'రిజల్ట్స్ కమిటీ'ని ఏర్పాటు చేస్తుందన్నారు.
ప్రస్తుతం కేటాయించే మార్కులు, గ్రేడ్లతో సంతృప్తి చెందని విద్యార్థులకు కరోనా అనంతరం ప్రత్యక్ష పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు ఏజీ వివరించారు. విద్యార్థులు ఆ పరీక్షలకు హాజరై.. తమ మార్కులను మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు.
ఫలితాలు ఎప్పుడంటే..
మరోవైపు, పన్నెండో తరగతి ఫలితాలు జులై 31న విడుదలయ్యే అవకాశం ఉందని సీబీఎస్‌ఈ కంట్రోలర్ వెల్లడించారు. జులై 20న పదో తరగతి ఫలితాలు వెలువడొచ్చని చెప్పారు.
మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులు.. పరీక్షలు రాసేందుకు త్వరలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి:సీబీఎస్‌ఈ క్లాస్ 12 గ్రేడింగ్ కోసం కమిటీ
'పరీక్షల రద్దు సరే.. మరి గ్రేడ్ల మాటేంటి?'