CBSE 10th result 2022: విద్యార్థులంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్. శుక్రవారం మధ్యాహ్నం బోర్డు ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్లు https://cbseresults.nic.in, https://cbse.digitallocker.gov.in/, https://cbse.gov.in ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించింది. విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్లతో ఈ ఫలితాలను పొందవచ్చు. కాగా.. ఈ ఉదయమే సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.
సీబీఎస్ఈ తొలిసారిగా 10, 12 తరగతుల ఫలితాలను ఒకేరోజు విడుదల చేసింది. పదో తరగతిలో బాలికలు 95.21 శాతంతో బాలురపై పైచేయి సాధించారు. అబ్బాయిల్లో 93.80, ట్రాన్స్జెండర్లలో 90 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి మే 24 వరకు జరిగాయి. దేశవ్యాప్తంగా 7,046 సెంటర్లలో జరిగిన సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు 21,16,209 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 8,94,993 మంది బాలికలు కాగా.. 12,21,195మంది బాలురు.
విద్యార్థులకు మోదీ అభినందనలు: సీబీఎస్ఈ 10, 12 తరగతుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో పరీక్షలకు సన్నద్ధమై విజయం సాధించారని అభినందించారు. విద్యార్థులు తమకు ఇష్టమైన సబ్జెక్టులు ఎంచుకుని చదవాలని కోరారు. ఒక పరీక్ష వ్యక్తి సామర్థ్యాన్ని నిరూపించలేదని ఫెయిలైన విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు వస్తాయని ప్రోత్సహించారు. 'పరీక్షా పే చర్చ' కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను ప్రధాని మోదీ పోస్ట్ చేశారు.
ఈసారి మెరిట్ లిస్టు లేదు: 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ను ప్రకటించారు కంట్రోలర్ సన్యం భరద్వాజ్. వచ్చే ఏడాది ఫిబ్రవరి 15న 10, 12 తరగతులు పరీక్షలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. గతేడాది కొవిడ్ కారణంగా 10, 12 తరగతుల పరీక్షలను వేర్వేరుగా నిర్వహించామని.. వైరస్ ప్రభావం తగ్గడం వల్ల రెండు ఒకేసారి నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థుల మధ్య ఆరోగ్యకర వాతావరణం నెలకొల్పాలనే ఉద్దేశంతో.. మెరిట్ లిస్టులను ప్రకటించడం లేదని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి
ప్రియురాలి తల నరికి.. స్టేషన్కు తీసుకెళ్లిన యువకుడు.. అందుకు ఒప్పుకోలేదనే!