CBSE Board Exams Twice A Year :సీబీఎస్ఈ 10, 12వ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండు సార్లు రాయడం తప్పనిసరేమీ కాదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పీటీఐ వార్తా సంస్థతో ముఖాముఖిలో వెల్లడించారు. సంవత్సరానికి పరీక్ష రాసే అవకాశం ఒక్కసారే ఉంటుందనే కారణంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవతున్నారని, అందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి వివరించారు.
"ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష JEE తరహాలో విద్యార్థులు సంవత్సరానికి రెండుసార్లు 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు రాసుకోవచ్చు. వీటిల్లో వచ్చిన ఉత్తమ మార్కులను విద్యార్థులు ఎంచుకోవచ్చు. ఇది పూర్తిగా ఐచ్ఛికం. ఇందులో బలవంతం ఏమీ లేదు. కాగా, ఈ కొత్త నిబంధన పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం 2024 నుంచి అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాము."
- ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి.
తప్పనిసరేమీ కాదు..
'ఆగస్టులో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించిన నూతన కరికులం ఫ్రేమ్‌వర్క్ ప్రకారం సీబీఎస్ఈ 10 లేదా 12వ తరగతి విద్యార్థి మొదటి సారి పరీక్షకు హాజరయ్యాడని అనుకుందాం. దీంట్లో అతడికి అత్యుత్తమ స్కోర్ వచ్చింది. ఆ ఫలితంతో సంతృప్తి చెందితే తదుపరి(రెండో సారి పరీక్షకు) హాజరుకావాల్సిన అవసరం లేదు. అదే వచ్చిన మార్కులతో సదరు విద్యార్థి సంతృప్తి చెందకపోతే మరోసారి పరీక్ష రాసి అందులో మంచి స్కోర్ సాధించుకోవచ్చు. అయితే ఈ రెండు పరీక్షల్లో వచ్చిన ఉత్తమ స్కోర్‌ను విద్యార్థికి సంబంధించిన మార్కుల మెమోలో పొందుపరుస్తారు. దీంతో విద్యార్థులకు పరీక్షల వల్ల కలిగే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అయితే ఇలా రెండు సార్లు పరీక్షకు హాజరుకావడం మాత్రం తప్పనిసరి కాదు. కాగా, ఈ కొత్త నిబంధనతో విద్యార్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు తగినంత సమయం దొరకడమే కాకుండా ఉత్తమమైన మార్కులు, ర్యాంకులు సాధించగలరు' అని కేంద్ర మంత్రి వివరించారు.
త్వరలో నోటిఫై చేస్తాం..
దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలు క్యాంపస్‌ల ఏర్పాటుకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించేందుకు చర్చలు జరుగుతున్నాయని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. త్వరలోనే వాటిని UGC నోటిఫై చేస్తుందని ఆయన చెప్పారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ సమన్వయంతో కూడా దీనిని సమీక్షిస్తున్నామని, ఆసక్తి ఉన్న అనేక దేశాలతో చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. "ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా పరిశీలిస్తున్నారు. మేము నిపుణుల సలహాల మేరకు అన్ని రకాలుగా చర్చలు జరిపిన తర్వాతే ముందుకు వెళ్తాం" అని మంత్రి చెప్పారు.