Manipur Women Parade : మణిపుర్లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐ అప్పగిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ ఘటనకు పాల్పడిన నిందితులకు కఠిన శిక్షలు పడేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటామని తెలిపింది. దీంతో పాటు పొరుగు రాష్ట్రం అసోంలో న్యాయ విచారణ జరిగేలా చూడాలని కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్ణయించింది. వైరల్ వీడియోను చిత్రీకరించిన ఫోన్ను స్వాధీనం చేసుకున్నామని.. వీడియో తీసిన వ్యక్తిని సైతం అరెస్ట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలు రాబట్టేందుకు ఫోన్ను రికవరీ చేస్తున్నామని చెప్పాయి. మణిపుర్లో సాధారణ పరిస్థితిని నెలకొల్పేందుకు మైతేయ్, కుకీ వర్గాల సంఘాలతో ఇప్పటికీ చర్చిస్తున్నామని కేంద్రం తెలిపింది.
Manipur Woman Paraded Viral Video : ఈనెల ఆరంభంలో ఇద్దరు గిరిజన మహిళలపై జరిగిన అత్యాచార ఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటం వల్ల దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. మోదీ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిదంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదే విషయంపై చర్చించాలంటూ పార్లమెంట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి.
Manipur Violence : గత మూడు నెలలుగా సాగుతున్న మణిపుర్ అల్లర్లలో ఇప్పటివరకు 181 మంది మృతిచెందారు. మే నెలలో ఈ హింస ప్రారంభమైన దగ్గరి నుంచి 10వేల ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మృతుల్లో 60 మంది మైతేయ్‌లు ఉండగా.. 113 మంది కుకీలు ఉన్నారు. ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. మొత్తంగా 21 మంది మహిళలు ఈ ఘర్షణలకు బలయ్యారు.