బంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్యకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సమన్లు జారీ చేసింది. బొగ్గు చౌర్యం కేసులో రుజిరా బెనర్జీకి నోటీసులు ఇచ్చింది. దర్యాప్తునకు హాజరు కావాలని స్పష్టం చేసింది. సీబీఐ అధికారులు స్వయంగా కోల్‌కతాలోని అభిషేక్ ఇంటికి వెళ్లి నోటీసు అందించారు.
అభిషేక్ బెనర్జీ గతంలో వేసిన పరువునష్టం కేసులో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బంగాల్ ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసిన రెండు రోజులకే.. సీబీఐ తాజా నోటీసులు ఇవ్వడం గమనార్హం.
అభిషేక్ భార్య రుజిరా బెనర్జీని వారి నివాసంలోనే సీబీఐ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించాయి.
'తప్పుగా ఆలోచించినట్లే'
కాగా, సీబీఐ నోటీసుపై అభిషేక్ బెనర్జీ స్పందించారు. తమ పార్టీ ఇలాంటివాటికి లొంగిపోదని పేర్కొన్నారు. 'ఇలాంటి చర్యలతో తమను బెదిరించాలని వారు అనుకుంటే.. తప్పుగా ఆలోచించినట్లే. మేం తలవంచే రకం కాదు' అని చెప్పారు. భారత చట్టాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు.
నిందితులు వీరే..
గతేడాది నవంబర్‌లో సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. మాంఝీ అలియాస్ లాలా, ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్ లి. జనరల్ మేనేజర్ అమిత్ కుమార్ ధార్, కాజోర్ ఏరియా మేనేజర్ జయేశ్ చంద్ర రాయ్, ఈసీఎల్ చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ తన్మయ్ దాస్, కాజోర్ ఏరియా సెక్యూరిటీ ఇంఛార్జ్ దేబాషిశ్ ముఖర్జీలను ఈ కేసులో నిందితులుగా చేర్చింది. మాంఝీ లాలాపై.. అక్రమ మైనింగ్‌కు పాల్పడటం సహా, కునుస్టోరియా, కాజోరా ప్రాంతాల్లో ఈసీఎల్ లీజుకు తీసుకున్న మైన్ల నుంచి బొగ్గును చోరీ చేశారన్న అభియోగాలను మోపింది.
ఇదీ చదవండి:తపోవన్ వద్ద ఎయిర్‌ఫోర్స్, నేవీ ఆపరేషన్