Manish Sisodia CBI : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాకు సీబీఐ సమన్లు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయానికి విచారణ కోసం రావాలని కోరింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ.. దేశంలోని అనేక ప్రదేశాల్లో సోదాలు జరిపి విజయ్ నాయర్, తెలంగాణకు చెందిన అభిషేక్ బోయినపల్లిని అరెస్ట్ చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలువురు రాజకీయ నాయకుల బంధువులు, అనుచరులను సీబీఐ విచారించింది. మనీశ్ సిసోదియా నివాసంపై రెండుసార్లు సోదాలు జరిపిన సీబీఐ.. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.
నేను రెడీ..
'నా ఇంట్లో 14 గంటల పాటు సీబీఐ సోదాలు నిర్వహించింది. ఏమీ దొరకలేదు. నా బ్యాంక్ లాకర్‌ను తనిఖీ చేశారు.. అందులోనూ ఏమీ కనిపించలేదు. నా గ్రామంలో సోదాలు నిర్వహించారు. అక్కడ కూడా ఎలాంటి ఆధారాలూ లభించలేదు. నాకు ఫోన్ చేసి సోమవారం ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయానికి విచారణ కోసం రావాలని కోరారు. నేను సోమవారం.. సీబీఐ విచారణకు హాజరవుతా. అధికారులకు పూర్తిగా సహకరిస్తా' అని మనీశ్ సిసోదియా ట్వీట్ చేశారు.