ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఓ విశ్రాంత రైల్వే ఉద్యోగి ఇంటి నుంచి భారీగా బంగారం, నగదును సీబీఐ స్వాధీనం చేసుకుంది. మాజీ ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ప్రమోద్ జెనా నివాసంలో సోదాలు నిర్వహించగా.. 17 కిలోల బంగారంతో పాటు రూ.1.57 కోట్ల నగదు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు.
1989 బ్యాచ్‌కి చెందిన ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి ప్రమోద్ కుమార్ జెనా.. భారతీయ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో చీఫ్ ఆపరేషన్ మేనేజర్‌గా పనిచేశారు. గత ఏడాది నవంబర్‌లో పదవీ విరమణ చేశారు. అయితే ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో జనవరి 3న ఆయనపై కేసు నమోదైంది. భువనేశ్వర్‌లోని ప్రమోద్ ఇంట్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబీఐ) మంగళవారం సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో రూ. 1.57 కోట్లకు పైగా ధనం, రూ.8 నుంచి రూ.10 కోట్లు మధ్య విలువ చేసే 17 కిలోల బంగారు ఆభరణాలతో పాటు రూ.2.5 కోట్ల విలువైన బ్యాంకు, పోస్టల్ డిపాజిట్ల రసీదులను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో ఆస్తి పత్రాలు కూడా దొరికినట్లు వారు వెల్లడించారు.