Land For Jobs Scam : రైల్వే ఉద్యోగాల కుంభకోణం కేసు దర్యాప్తులో జోరు పెంచింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). సోమవారం బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని విచారించిన సీబీఐ.. మంగళవారం ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్‌ను ప్రశ్నించింది. ఐదుగురు అధికారులతో కూడిన సీబీఐ బృందం.. పండర పార్క్‌లో ఉన్న మీసా భారతి ఇంటికి చేరుకుంది. గత కొంత కాలంగా ఆయన తన కూతురు రాజ్యసభ ఎంపీ, మీసా భారతి ఇంట్లోనే ఉంటున్నారు. సీబీఐ విచారణకు తాము పూర్తి సహకారం అందిస్తామని లాలూ కుటుంబ సభ్యులు తెలిపారు.
సోమవారం ఉదయం లాలూ సతీమణి, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని ప్రశ్నించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. రబ్రీదేవి వాంగ్మూలాన్ని నమోదు చేశామని.. ప్రస్తుతం ఆమె నివాసంలో ఎలాంటి సోదాలు నిర్వహించడం లేదని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. రబ్రీదేవి అపాయిట్‌మెంట్ తీసుకున్న తర్వాతే ఆమెను ప్రశ్నించినట్లు సీబీఐ అధికారులు సోమవారం వెల్లడించారు. రాజ్యాంగ సంస్థలను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు లేఖ రాసిన మరుసటి రోజే రబ్రీదేవి విచారించడంపై ఆర్జేడీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోదీకి రాసిన లేఖపై బిహార్ ఉప ముఖ్యమంత్రి, ఆమె కుమారుడు తేజస్వి యాదవ్ కూడా సంతకం చేశారని.. అందుకే కేంద్రం కక్ష సాధింపులకు పాల్పడుతోందని విమర్శించారు.
తన కుటుంబంపై సీబీఐ చేస్తున్న దాడులపై స్పందించారు బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్. బీజేపీకి వ్యతిరేకంగా తమ కుటుంబం పోరాటం చేస్తుందనే ఇలా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దర్యాప్తు సంస్థలు.. బీజేపీకి కొమ్ము కాస్తున్నాయని విమర్శించారు.