తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీబీఐలో మార్పు రాదా?'

న్యాయాధికారులపై దాడులు, బెదిరింపులు అధికమవుతున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సీబీఐ, ఐబీ విభాగాలు న్యాయవ్యవస్థకు సహకరించడం లేదని జస్టిస్​ ఎన్​ వీ రమణ అన్నారు. సీబీఐలో మార్పు రాదా? అని ప్రశ్నించారు.

NV Ramana
ఎన్​ వీ రమణ, సీజేఐ

By

Published : Aug 7, 2021, 7:45 AM IST

Updated : Aug 7, 2021, 8:59 AM IST

దేశంలో న్యాయాధికారులపై దాడులు, దూషణలు అధికమవుతున్నాయని శుక్రవారం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ఈ విషయంలో నిఘా విభాగం (ఇంటెలిజెన్స్‌ బ్యూరో-ఐబీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లు న్యాయ వ్యవస్థకు సహకరించడం లేదని ఆవేదన చెందింది. "ఒకటి రెండు సందర్భాల్లో న్యాయస్థానం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఏడాది దాటినా సీబీఐ ఏమీ చేయలేదు. నాకు తెలుసు.. ఒక కేసులో అయితే ఎలాంటి చర్యా లేదు. సీబీఐ వైఖరిలో మార్పు వస్తుందని ఆశించాం.కానీ ఎలాంటి మార్పూ లేదు. ఇలా చెప్పడానికి చింతిస్తున్నా. కానీ ఇది వాస్తవం" అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ వ్యాఖ్యానించారు.

సీబీఐలో మార్పు రాదా?

న్యాయాధికారులకు భద్రత కల్పించడానికి ప్రత్యేక దళాలను ఏర్పాటు చేయాలని కోరుతూ 2019లో దాఖలైన వ్యాజ్యాన్ని, ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ను ఆటోతో ఢీకొట్టించి హత్య చేసిన ఉదంతాన్ని ఆయన జస్టిస్‌ సూర్యకాంత్‌తో కలిసి సుమోటోగా విచారణ చేపట్టారు. తమకు వస్తున్న బెదిరింపుల గురించి న్యాయమూర్తులే ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆవేదనాగ్రహం వ్యక్తం చేశారు.

సీబీఐ

"దేశంలో గ్యాంగ్‌స్టర్స్‌, అత్యున్నతస్థాయి వ్యక్తుల ప్రమేయం ఉన్న ఎన్నో కేసులు కోర్టులముందున్నాయి. ఫలితంగా న్యాయమూర్తులను బెదిరించడంతోపాటు, మానసికంగా వేధిస్తూ వాట్సప్‌, ఎస్‌ఎంఎస్‌ సందేశాలు పంపుతున్నారు. వాటిపై న్యాయమూర్తులు పోలీసులకు, సీబీఐకి ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందించడంలేదు."

-- జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

తీర్పు అనుకూలంగా రాకుంటే బురద జల్లుతున్నారు

ఈ కేసులో కోర్టుకు సహాయం అందిస్తున్న అటార్నీ జనరల్‌ కె.కె. వేణుగోపాల్‌ను ఉద్దేశించి జస్టిస్‌ రమణ మాట్లాడుతూ "ఏ కేసులోనైనా అనుకూలమైన ఉత్తర్వులు రాకపోతే న్యాయమూర్తులపై బురదచల్లే కొత్త రకం పోకడ దేశంలో మొదలైంది. వాటిపై ఫిర్యాదు చేసే స్వేచ్ఛ కూడా న్యాయాధికారులకు లేదు. వారు ప్రధాన న్యాయమూర్తికో, సంబంధిత జిల్లా అధికారికో ఫిర్యాదు చేస్తారు. దీనిపై దర్యాప్తు చేయాలని పోలీసులనో, సీబీఐనో ఆదేశిస్తే అవి స్పందించడం లేదు. నేను ఈ వ్యాఖ్యలను బాధ్యతాయుతంగా చేస్తున్నా" అని అన్నారు. వేణుగోపాల్‌ స్పందిస్తూ దాడులకు గురైన న్యాయమూర్తుల జాబితా తన వద్ద ఉందని చెప్పారు. కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. అధికారుల కన్నా నాలుగు గోడల మధ్య కూర్చొని తీర్పులు ఇచ్చే జడ్జీలకే ముప్పు అధికమని చెప్పారు. దీనిపై లిఖితపూర్వక సమాధానమిస్తామని అన్నారు.

కేంద్రం కౌంటర్‌ కూడా వేయలేదు

జస్టిస్‌ రమణ స్పందిస్తూ "యువ న్యాయాధికారి ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. ధన్‌బాద్‌ బొగ్గు మాఫియా ప్రాంతం కాబట్టి అక్కడ న్యాయాధికారుల ఇళ్ల వద్ద భద్రత కల్పించి ఉండాల్సింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఇది ప్రభుత్వ వైఫల్యం" అని పేర్కొన్నారు. రైల్వే భద్రతా దళం తరహాలో న్యాయమూర్తుల కోసం ప్రత్యేక భద్రతా దళాలను ఏర్పాటు చేయాలని కోరుతూ 2019లో దాఖలైన కేసులో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయలేదు. దీనిపై కేంద్రం స్పందించాలి’’ అని జస్టిస్‌ రమణ పేర్కొన్నారు.

సీబీఐకి ఇచ్చి చేతులు దులిపేసుకున్నారా?

ధన్‌బాద్‌ న్యాయాధికారి హత్యపై ఝార్ఖండ్‌ అడ్వకేట్‌ జనరల్‌ రాజీవ్‌ రంజన్‌ వివరణ ఇచ్చారు. "ఆ సంఘటన జరిగిన వెంటనే 22 మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశాం. న్యాయాధికారిని ఢీకొట్టిన ఆటోలోని ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు మేరకు ఈ కేసు విచారణను సీబీఐ తీసుకొంది" అని తెలిపారు. అందుకు జస్టిస్‌ రమణ స్పందిస్తూ "దాంతో మీరు చేతులు దులిపేసుకున్నారన్నమాట?" అని అన్నారు. అందుకు అడ్వకేట్‌ జనరల్‌ స్పందిస్తూ "ఈ కేసు మూలాలు రాష్ట్రాల సరిహద్దులను దాటాయి. లోతైన కుట్ర ఉండటంతో సీబీఐకి అప్పగించాం. న్యాయాధికారుల ఇళ్లకు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది" అని వివరించారు. ఈ కేసు తాజా పరిస్థితి తెలపడానికి సోమవారం హాజరుకావాలని సీబీఐని జస్టిస్‌ రమణ ఆదేశించారు.

ఇదీ చదవండి:లైంగిక దాడి అంటే ఏమిటి?

Last Updated : Aug 7, 2021, 8:59 AM IST

ABOUT THE AUTHOR

...view details