cbi enquiry ys viveka murder case : వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ ఎదుట మూడోసారి విచారణకు హాజరయ్యారు. కోఠిలోని సీబీఐ కార్యాలయానికి ఆయన ఉదయం 11 గంటల ప్రాంతంలో చేరుకున్నారు. సాయంత్రం 3.30 గంటల వరకు సుమారు నాలుగున్నర గంటల పాటు ఆయనను సీబీఐ అధికారులు విచారించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అక్కడకు భారీగా తరలివచ్చారు. ముందుజాగ్రత్తగా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. వివేకా కుటుంబంలో నెలకొన్న విభేదాల కారణంగానే ఆయన హత్య జరిగిందని అవినాష్‌రెడ్డి ఆరోపించారు. వివేకాను ఆస్తి కోసమే హత్య చేశారన్నారు. హత్య జరిగిన ప్రాంతంలో లేఖను మాయం చేశారని... వివేకా కుమార్తె సునీత భర్త చెబితేనే తాను సంఘటన స్థలానికి వెళ్లానన్నారు. తన సోదరి సునీత హైకోర్టులో సుప్రీంకోర్టులో అనేక ఆరోపణలు చేసిందని... ఏ రోజు తాను ఎవరి గురించి మాట్లాడలేదని అవినాష్ తెలిపారు. తాను కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగానే సీబీఐ అధికారులు సునీతకు సమాచారం ఇచ్చి ఇంప్లీడ్ చేయిస్తున్నారని ఆరోపించారు. వివేకానందరెడ్డి ఒక ముస్లిం మహిళను వివాహం చేసుకున్నారని... ఆమెకు పుట్టిన కుమారుడు రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఆయన కూడా తన పేరును ముస్లింగా మార్చుకున్నారన్నారు. ఇన్ని రోజులు తాను మౌనంగా ఉన్నానని కార్యకర్తలు, అనుచరులు తనను ప్రశ్నిస్తున్నారని... ఇక నుంచి మాట్లాడడం మొదలు పెడతానని అవినాష్‌రెడ్డి చెప్పారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. విచారణ అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మళ్లీ పిలిచినప్పుడు రావాలని సీబీఐ అధికారులు చెప్పినట్లు తెలిపారు. విచారణ సందర్భంగా.. చేసిన ఆడియో, వీడియో రికార్డింగ్ కావాలని ఇప్పటికే పలుమార్లు అడిగాం.. అయినా ఇవ్వకపోవడంతో హైకోర్టుకు వెళ్లాం అని వెల్లడించారు. విచారణ తప్పుదోవ పడుతోందని గతంలోనే చెప్పామని గుర్తుచేస్తూ.. తప్పుడు ఆరోపణలతో అమాయకులను ఇరికిస్తున్నారని ఆరోపించారు.
గుండెపోటు.. అని నేనెప్పుడూ చెప్పలేదు.. కుట్రలకు ఉపయోగపడే స్టేట్‌మెంట్లనే తీసుకుంటున్నారని, కట్టుకథను అడ్డంపెట్టి విచారణను ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఎలాంటి తప్పూ చేయలేదని కార్యకర్తలకు హామీ ఇస్తున్నా అని అవినాష్‌రెడ్డి చెప్పారు. ఎంతవరకైనా న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. పిటిషన్లు వేసి కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని, కేసు విచారణ వెనుక రాజకీయ కుట్రలు దాగి ఉన్నాయని ఆరోపించారు. సీబీఐ విచారణ.. కంచే చేను మేసిన చందంగా ఉందని అన్నారు. హత్యాస్థలంలో దొరికిన లేఖ, ఫోన్‌ను దాచడం నేరం కాదా?, లేఖలోని వివరాలను దర్యాప్తు అధికారులకు చెప్పరా? అని సీబీఐ అధికారులను అవినాష్‌రెడ్డి ప్రశ్నించారు. గుండెపోటు అని నేను ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదని, గుండెపోటుగా తాను చెప్పినట్లు టీడీపీ నాయకులే చిత్రీకరించారని అన్నారు.