CBI Odisha train accident : ఒడిశాలో 292 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకున్న బాలేశ్వర్ రైలు ప్రమాదంపై కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) చేస్తున్న దర్యాప్తులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా బాలాసోర్ సిగ్నల్ జేఈ అమీర్‌ఖాన్ అద్దె ఇంటికి సోమవారం సీల్ వేసిన సీబీఐ అధికారులు.. మంగళవారం అతని సమక్షంలోనే ఆ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఇంతకుముందు అమీర్ ఖాన్‌ను రహస్య ప్రాంతానికి తరలించి సుదీర్ఘంగా విచారించారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌ను తారుమారు చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బాలేశ్వర్ రైలు ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదంపై జూన్ 6న సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అప్పటి నుంచి జరుగుతున్న దర్యాప్తు.. జేఈ అమీర్ ఖాన్ ఇంటికి సీల్ వేసిన నేపథ్యంలో కీలక మలుపు తిరిగింది.
జూన్ 2వ తేదీ రాత్రి బాలేశ్వర్ రైలు ప్రమాద ఘటన జరగ్గా.. సీబీఐ రంగంలోకి దిగింది. జేఈ అమీర్ ఖాన్ కదలికలపై నిఘా ఉంచింది. విచారణ చేపట్టిన తొలినాళ్లలోనే సిగ్నల్ జేఈని రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మరీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అమీర్ ఖాన్ ఇంటికి సీల్ వేసిన తర్వాత సీబీఐ అధికారుల బృందం.. సోరోలోని తెంటెయ్ ఛక్‌లో ఉన్న బాహానగా స్టేషన్ మాస్టర్ ఇంటిని సైతం పరిశీలించింది. జూన్ 16న బాలేశ్వర్‌లో పలువురిని విచారించిన సీబీఐ అధికారులు దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది.