CBI Odisha train accident : ఒడిశా బాలేశ్వర్‌లో జరిగిన మూడు రైళ్ల ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఘటనాస్థలిని సందర్శించింది. 10 మంది అధికారులతో కూడిన సీబీఐ బృందం.. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించింది. ప్రమాదంపై రైల్వే అధికారులతో సీబీఐ అధికారులు మాట్లాడారు. ఫోరెన్సిక్ బృందాలు సైతం ఘటనాస్థలికి చేరుకున్నాయని ఆగ్నేయ రైల్వే సీపీఆర్ఓ ఆదిత్య కుమార్ చౌదరి వెల్లడించారు.
"ఫోరెన్సిక్, సీబీఐ బృందాలు ఇక్కడికి వచ్చాయి. దర్యాప్తులో భాగంగా వారు అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. రైల్వే శాఖ అధికారులు వారికి సహకరిస్తున్నారు. అవసరమైన సమాచారం అందిస్తున్నారు. ప్రమాదం వెనుక కుట్ర దాగి ఉందా అనే కోణం సహా అన్ని కోణాల్లోనూ సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు."
-ఆదిత్య కుమార్ చౌదరి, ఆగ్నేయ రైల్వే సీపీఆర్ఓ
ఇప్పటికే ఈ ప్రమాద ఘటనపై కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ CRS బృందం కొన్ని రోజులుగా దర్యాప్తు చేస్తోంది. సీబీఐ దర్యాప్తు కూడా సమాంతరంగా సాగనుంది. ఖరగ్‌పుర్, బాలేశ్వర్ సహా వివిధ ప్రాంతాల్లో CRS బృందం పర్యటించి సమాచారం సేకరించింది. ప్రమాదానికి గురైన కోరమాండల్, బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్సు రైలులో విధులు నిర్వర్తించిన లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకోపైలట్లు, ప్రమాదం జరిగిన స్టేషన్‌లో సిగ్నలింగ్ సిబ్బంది సహా 55 మందిని విచారించింది. మూడు రైళ్లలో విధుల్లో ఉన్న పలువురు ఇతర ఉద్యోగులను, ప్రమాదం జరిగిన స్టేషన్‌తోపాటు పక్క స్టేషన్లలో సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. దర్యాప్తు పూర్తికావడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
కాంగ్రెస్ విమర్శలు..
వార్తా పత్రికల్లో హెడ్లైన్ కోసమే ఒడిశా ప్రమాదంపై సీబీఐ విచారణకు ఆదేశించారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్ పార్టీ. బాలేశ్వర్ ఘోర విపత్తుపై రైల్వే సేఫ్టీ కమిషనర్ నివేదిక ఇవ్వకముందే సీబీఐ విచారణకు ఆదేశించడం ఏంటని ప్రశ్నించింది. 2016 కాన్పుర్ రైలు ప్రమాదంలో ఎన్ఐఏ ఇప్పటికీ తన నివేదిక సమర్పించలేదని గుర్తు చేసింది.