CBI NOTICES TO YS BHASKAR REDDY : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు శరవేగంగా సాగుతోంది. ఈ కేసులో సీబీఐ అన్ని కోణాల్లో విచారణ ముమ్మరం చేసింది. తాజాగా వివేకా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్‌రెడ్డికి సైతం సీబీఐ మరోమారు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 12న కడపలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పులివెందులలో ఆయన ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు భాస్కర్‌రెడ్డికి నోటీసులు అందజేశారు. 12వ తేదీ ఉదయం 10 గంటలకు కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
వివేకా హత్య కేసు.. మరోసారి వైఎస్ భాస్కర్‌రెడ్డికి సీబీఐ నోటీసులు - సీబీఐ
CBI NOTICES TO YS BHASKAR REDDY : మాజీ మంత్రి Y.S.వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాస్కర్‌రెడ్డికి.. సీబీఐ రెండోసారి నోటీసులు ఇచ్చింది. పులివెందులలో భాస్కర్‌రెడ్డి ఇంటికి వెళ్లి.. సీబీఐ అధికారులు నోటీసులు అందజేశారు.
ఇప్పటికే వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి కుమారుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో రెండు సార్లు ప్రశ్నించారు. తాజాగా వైఎస్ భాస్కర్ రెడ్డిని ప్రశ్నించడానికి నోటీసు అందజేశారు. వివేకా హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలో సాక్ష్యాధారాలు చెరిపేయడంతో పాటు కేసులో భారీ కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు విచారణకు పిలిచినట్లు సమాచారం. వివేకా హత్య జరగడానికి కొన్ని గంటల ముందు నిందితుడు సునీల్ యాదవ్.. భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు సీబీఐ అధికారులు గూగుల్ టేక్ అవుట్ ద్వారా నిర్ధారణ చేసుకున్నారు. ఆ మేరకు భాస్కర్ రెడ్డిని ప్రశ్నించడానికి ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని నోటీసులు అందజేశారు. గత నెల ఫిబ్రవరి 23న విచారణకు రావాలని భాస్కర్‌రెడ్డికి గతంలో సీబీఐ నోటీసులు జారీ చేయగా.. తాను రాలేనని సమాధానమిచ్చారు.
CBI ON VIVEKA MURDER CASE UPDATES : బెయిల్ మంజూరు చేయాలని వివేకా హత్య కేసు ప్రధాన నిందితుడు సునీల్ యాదవ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే సునీల్ యాదవ్ బెయిలు పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్లో హత్య కుట్ర గురించి పలు సంచలన విషయాలు వెల్లడించింది. వివేకా హత్య జరగడానికి కొన్ని గంటల ముందు ఎంపీ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి ఇంట్లో.. సునీల్ యాదవ్ ఉన్నట్లు పేర్కొంది.
పథకం ప్రకారమే వివేకానంద హత్య: 2019 మార్చి 14న ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంట్లో నిందితుడు సునీల్ యాదవ్ ఎదురు చూస్తుండగా.. రాత్రి 8గంటల 30 నిమిషాలకు దస్తగిరి వచ్చాడని.. ఆ తర్వాత పథకం ప్రకారమే భాస్కర్ రెడ్డి తన రెండు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసినట్లు సీబీఐ తెలిపింది. రాత్రి 9 నుంచి 9.30 గంటల మధ్య మందు తాగేందుకు వివేకా ఇంటి సమీపంలోకి రావాలని దస్తగిరిని సునీల్ యాదవ్ పిలిచాడని పేర్కొంది. రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకూ మద్యం తాగుతుండగా.. వివేకా కారు ఆయన ఇంట్లోకి వెళ్లినట్లు గుర్తించారు. దస్తగిరి, ఉమాశంకర్‌రెడ్డి అర్ధరాత్రి వరకూ.. మద్యం తాగుతున్న ఏరియాలోనే ఉన్నట్లు ఆధారాలు లభించాయని.. వివరించింది. 14వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఉమాశంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి వెనుక వైపు కాంపౌండ్ దాటి.. వివేకానంద ఇంట్లోకి ప్రవేశించారని.. దీనికి గంగిరెడ్డి సహకరించినట్లు తెలిపింది.
ఇవీ చదవండి: